
ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. తమ ఫ్రాంచైజీ నుంచి హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ తప్పుకున్నాడని కేకేఆర్ యాజమాన్యం ట్విటర్ వేదికగా ప్రకటించింది.
పండిట్ కొత్త అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించుకున్నారు. ఇకపై అతను కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రధాన కోచ్‌గా కొనసాగరు. అతని అమూల్యమైన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు.
2024 ఎడిషన్‌లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించడంతో పాటు బలమైన, దృఢమైన జట్టును నిర్మించడంలో సహాయపడినందుకు అతనికి ధన్యవాదాలు.
అతని నాయకత్వం మరియు క్రమశిక్షణ జట్టుపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. భవిష్యత్తు కోసం అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంటూ కేకేఆర్ యాజమాన్యం తమ ట్విటర్ మెసేజ్‌లో పేర్కొంది.
కాగా, పండిట్ 2024 ఎడిషన్‌లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంతో కీలకపాత్ర పోషించాడు. అయితే గత సీజన్‌లో అతని ఆథ్వర్యంలో కేకేఆర్ పేలవ ప్రదర్శనలు చేసి ఎనిమిదో స్థానంలో (14 మ్యాచ్‌ల్లో కేవలం 5 విజయాలు) నిలిచింది.
అప్పటి నుంచి కేకేఆర్ యాజమాన్యం పండిట్‌పై అసంతృప్తిగా ఉంది. తాజాగా పండిట్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు యాజమాన్యమే ముందుగా ప్రకటన చేసింది.
పండిట్ 2022 ఆగస్ట్‌లో కేకేఆర్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. నాటి కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక కావడంతో కేకేఆర్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. పండిట్ ఆధ్వర్యంలో కేకేఆర్ 3 సీజన్లలో 42 మ్యాచ్‌లు ఆడి 22 మ్యాచ్‌ల్లో గెలిచి, 18 మ్యాచ్‌ల్లో ఓడింది. 2 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.
బౌలింగ్ కోచ్ కూడా తప్పుకున్నాడు..
కేకేఆర్ యాజమాన్యం హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా తప్పించినట్లు తెలుస్తుంది. భరత్ అరుణ్ త్వరలో చెన్నై సూపర్‌కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా జాయిన్ అవుతాడని సమాచారం. అరుణ్ 2014-2021 వరకు టీమిండియా బౌలింగ్ కోచ్‌గా అందరికీ సుపరిచితుడు.