
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో ఇవాళ (జులై 29) జరిగిన మ్యాచ్‌లో ఓ ఓవర్‌లో ఏకంగా 18 బంతులు వేశాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఏ బౌలర్ ఓ ఓవర్‌లో ఇన్ని బంతులు వేయలేదు.
గతంలో ఈ రికార్డు విండీస్ లోకల్ ప్లేయర్ రోషన్ ప్రైమస్ పేరిట ఉండేది. ప్రైమస్ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఓ మ్యాచ్‌లో ఓవర్‌లో 13 బంతులు వేశాడు. తాజాగా ప్రైమస్ రికార్డును హేస్టింగ్స్ బద్దలు కొట్టాడు.
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన హేస్టింగ్స్ 12 వైడ్లు, ఓ నో బాల్ వేశాడు. ఈ ఓవర్‌లో కేవలం ఐదు బంతులు మాత్రమే వేసిన అతను మొత్తంగా 20 పరుగులు సమర్పించుకున్నాడు. ఆసీస్ 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఇది జరిగింది.
హేస్టింగ్స్ గల్లీ బౌలర్ల కంటే అధ్వానంగా బౌలింగ్ చేసి అందరికీ విసుగు తెప్పించాడు. 39 ఏళ్ల హేస్టింగ్స్ ఆసీస్ తరఫున ఓ టెస్ట్, 29 వన్డేలు, 9 టీ20లు ఆడి ఉండటం కొసమెరుపు. ఇతగాడు ఐపీఎల్‌లోనూ 3 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన ఆటగాడిని నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించింది కాదు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. ఆస్ట్రేలియాను 11.5 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ చేసింది. సయీద్ అజ్మల్ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూల్చాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో బెన్ డంక్ (26), కల్లమ్ ఫెర్గూసన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం 75 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆడుతూపాడుతూ 7.5 ఓవర్లో వికెట్ కూడా కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్ 23 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 32, సోహైబ్ మక్సూద్ 26 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి పాక్‌ను గెలుపు తీరాలు దాటించారు.
కాగా, ఈ టోర్నీలో పాక్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఇవాళ రాత్రి భారత్ తమ చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కవచ్చు. భారత్ ఈ టోర్నీలో పాక్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.