
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)- ఓవల్ పిచ్ క్యూరేటర్ మధ్య చోటు చేసుకున్న వాగ్వాదంపై భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ (Sitanshu Kotak) వివరణ ఇచ్చాడు. ఓవల్ గ్రౌండ్ క్యురేటర్ కాస్త దూకుడైన వ్యక్తి అని తమకు ముందే తెలుసని తెలిపాడు.
మేమేమీ స్పైక్స్‌తో రాలేదు
ఈ సిరీస్‌లో ఆడిన నాలుగు టెస్టుల్లోనూ పిచ్ క్యురేటర్లు తమకు బాగా సహకరించారని, ఇక్కడే ఇలాంటి అనుభవం ఎదురైందని చెప్పాడు. ‘ఒక జట్టు కోచ్‌ను 2.5 మీటర్ల దూరం నిలబడమని చెప్పడం చాలా ఇబ్బందిగా అనిపించింది.
మేమేమీ స్పైక్స్‌తో రాలేదు. రబ్బరు చెప్పులతో అక్కడ నిలబడ్డాం కాబట్టి పిచ్ పాడవుతుందనే సమస్యే లేదు. అలా ఎవరైనా ఎందుకు చేస్తారు. పిచ్‌ను జాగ్రత్తగా చూసుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు గానీ ఇది కాస్త అతిగా అనిపించింది.
అది క్రికెట్ పిచ్ మాత్రమే
మా జట్టు సభ్యులు అక్కడ ఆడబోతున్నారు. ఎన్ని మాటలు చెప్పినా అది క్రికెట్ పిచ్ మాత్రమే. కాలు పెట్టగానే విరిగిపోయేందుకు అదేమీ 200 ఏళ్లనాటి పురాతన వస్తువు కాదు’ అని కొటక్ వివరించాడు. కాగా ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక ఐదో టెస్టుకు టీమిండియా సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే.
లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగే ఆఖరి పోరుకు సిద్ధమయ్యే క్రమంలో భారత ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆప్షనల్ ప్రాక్టీస్ నేపథ్యంలో ప్లేయర్లతో పాటు కోచింగ్ బృందం మైదానానికి వెళ్లింది.
హద్దుల్లో ఉండు
ఈ క్రమంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తన సహచర సిబ్బందితో కలిసి పిచ్‌ను పరిశీలించేందుకు వెళ్లాడు. అయితే, ఓవల్ మైదానం క్యూరేటర్ లీ ఫోర్టస్ బృందంలోని ఓ సభ్యుడు గంభీర్, అతడి సహచరులను పిచ్‌కు దూరంగా ఉండమని హెచ్చరించాడు.
పిచ్ పాడకుండా జాగ్రత్తలు చెప్పే క్రమంలో అతడు కాస్త ‘అతి’గా ప్రవర్తించడంతో చిర్రెత్తిపోయిన గంభీర్.. ‘నువ్వు గ్రౌండ్స్‌మెన్‌వి మాత్రమే. హద్దుల్లో ఉండు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో సితాన్షు కొటక్ వచ్చి క్యూరేటర్‌ను దూరంగా తీసుకువెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉంటే.. క్యూరేటర్- గంభీర్ మధ్య వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: ‘స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు’