
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes)కు సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ అండగా నిలిచాడు. మాంచెస్టర్ టెస్టులో టీమిండియా ఆటగాళ్లకు ముందుగానే ‘షేక్‌హ్యాండ్’ ఇవ్వడంలో తప్పులేదంటూ సమర్థించాడు. జెంటిల్‌మేన్ గేమ్ అంటే.. ఇలాగే ఉండాలంటూ స్టోక్స్‌కు మద్దతు పలికాడు.
ఆద్యంతం ఉత్కంఠ
సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంసీకి కౌంటర్ ఇచ్చే క్రమంలో డేల్ స్టెయిన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగిందంటే.. భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్‌లో నాలుగో టెస్టు జరిగింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన స్టోక్స్ బృందం ఏకంగా 669 పరుగులు చేసింది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది.
నలుగురు హీరోలు
అనంతరం ఊహించని రీతిలో పుంజుకుని ఆఖరి రోజు ఆఖరి సెషన్ వరకూ నిలబడి.. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో డ్రాతో గట్టెక్కింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (90) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోగా.. శుబ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (103) ఆడాడు. అయితే, వీరిద్దరు అవుటైన తర్వాత భారత శిబిరంలో ఆందోళన పెరిగింది.
ఈ క్రమంలో స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతమే చేశారు. జడ్డూ 107, వాషీ 101 పరుగులతో సత్తా చాటారు. అయితే, వీరు శతకాలకు చేరువైన వేళ.. ఎలాగో ఫలితం తేలదు కాబట్టి ఇక చాలు ఆపేద్దాం అని స్టోక్స్ పదే పదే షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చాడు. అయితే, జడ్డూ మాత్రం ఇందుకు నిరాకరించాడు.
సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాతే డ్రా
ఇక జడ్డూ, వాషీ ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత టీమిండియా డ్రాకు సమ్మతం తెలిపింది. ఈ నేపథ్యంలో స్టోక్స్ తీరుపై విమర్శలు వచ్చాయి. సౌతాఫ్రికా స్పిన్నర్ షంసీ కూడా.. జడేజా, వాషీ శతకాలు పూర్తి చేసుకునేందుకు అర్హులంటూ స్టోక్స్‌ను సోషల్ మీడియా వేదికగా విమర్శించాడు.
స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు
ఇందుకు ప్రొటిస్ మాజీ పేసర్ డేల్ స్టెయిన్ బదులిస్తూ.. ‘‘షామో.. ఉల్లిపాయ ఎన్నో పొరలతో నిర్మితమై ఉంటుంది. ఒక్కో పొర తీస్తున్నకొద్దీ ఎవరో ఒకరు ఏడవక తప్పదు. సంక్లిష్టమైన సందర్భాల్లో దీనిని మనం అన్వయించుకోవచ్చు.
అక్కడున్న బ్యాటర్లు సెంచరీలు పూర్తి చేసేందుకు ఆడటం లేదు. కేవలం మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకే వారు బ్యాటింగ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ పని పూర్తైన తర్వాత జెంటిల్‌మేన్ ఎవరైనా షేక్‌హ్యాండ్ ఇస్తారు.
అంతేగానీ.. అక్కడ మిగిలి ఉన్న సమయాన్ని మైలురాళ్లను చేరుకునేందుకు ఉపయోగించుకోకూడదు. అయితే, నిబంధనల ప్రకారం వారు తమ పని పూర్తి చేసుకోవచ్చు. కానీ చూడటానికి ఇది అంత గొప్పగా కనిపించదు.
ఒకవేళ నిజంగానే వాళ్లు సెంచరీలు పూర్తి చేయాలనుకుంటే ముందు నుంచే ఎందుకు వేగంగా ఆడలేదు. చివరి సెషన్.. చివరి గంట వరకూ ఎందుకు నెమ్మదిగానే ఆడారు. డ్రా కోసమే వారు అలా చేశారు. మరి అలాంటప్పుడు ఒక జట్టునే నిందించడం దేనికి?’’ అని ప్రశ్నించాడు.
‘నేను’ అనే స్వార్థానికి తావుండదు
ఇందుకు.. ‘‘ఇరుజట్లకూ తమ నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. ఒకవేళ బ్యాటర్‌ను ఫీల్డ్ బయటకు పంపించాలంటే అవుట్ చేయవచ్చు కదా!’’ అంటూ షంసీ కౌంటర్ ఇచ్చాడు.
ఈ క్రమంలో.. ‘‘చివరి గంట వ్యక్తిగత మైలురాళ్లను చేరుకోవడానికి కేటాయించింది కాదు. జట్టులో ‘నేను’ అనే స్వార్థానికి తావుండదు. ఒకవేళ నేనే అక్కడ 90 పరుగులతో ఉండి ఉంటే కచ్చితంగా డ్రాకు అంగీకరించేవాడిని’’ అని స్టెయిన్ బదులిచ్చాడు.
చదవండి: నా కొడుకు ఏమి తప్పు చేశాడు: సెలక్టర్లపై సుందర్ తండ్రి ఫైర్