
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాకిస్తాన్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఆ జట్టు.. ఇవాళ (జులై 29) ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. ఆస్ట్రేలియాను 11.5 ఓవర్లలోనే ఆలౌట్ చేసింది.
స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ 6 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 74 పరుగులకే కుప్పకూలింది. అజ్మల్ ధాటికి ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టులో బెన్ డంక్ (26), కల్లమ్ ఫెర్గూసన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. షాన్ మార్ష్ 7, క్రిస్ లిన్ 6, డి ఆర్చీ షార్ట్ 2, డేనియల్ క్రిస్టియన్ 0, బెన్ కటింగ్ 5, నాథన్ కౌల్టర్ నైల్ 0, పీటర్ సిడిల్ 5, స్టీవ్ ఓకీఫ్ 1, బ్రెట్ లీ 1 (నాటౌట్) పరుగులు చేశారు.
పాక్ బౌలర్లలో అజ్మల్‌తో పాటు ఇమాద్ వసీం (3-0-11-2), సోహైల్ తన్వీర్ (2-0-8-1), సోహైల్ ఖాన్ (2-0-23-1) కూడా వికెట్లు తీశారు.
అనంతరం 75 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆడుతూపాడుతూ 7.5 ఓవర్లో వికెట్ కూడా కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్ 23 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 32, సోహైబ్ మక్సూద్ 26 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి పాక్‌ను గెలుపు తీరాలు దాటించారు. ఆసీస్ కెప్టెన్ ఐదుగురు బౌలర్లను ప్రయోగించినా ఒక్క పాక్ వికెట్‌ను కూడా తీయలేకపోయారు.
కాగా, ఈ టోర్నీలో పాక్‌తో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా కూడా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఇవాళ రాత్రి భారత్ తమ చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కవచ్చు. భారత్ ఈ టోర్నీలో పాక్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.