
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025)సీజన్‌ను ఇండియా చాంపియన్స్ ఓటమితో ఆరంభించింది. సౌతాఫ్రికా చాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సేన 88 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. నార్తాంప్టన్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా చాంపియన్స్ తొలుత బౌలింగ్ చేసింది.
డివిలియర్స్ విధ్వంసం
ఈ క్రమంలో ఓపెనర్లు హషీమ్ ఆమ్లా (22), జాక్వెస్ రుడాల్ఫ్ (24) సౌతాఫ్రికాకు శుభారంభం అందించారు. వన్‌డౌన్ బ్యాటర్ సరేల్ ఎర్వీ (15) నిరాశపరచగా.. ఏబీ డివిలియర్స్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. రీఎంట్రీలో నాలుగో స్థానంలో బరిలో దిగిన ఈ లెజెండరీ బ్యాటర్ అజేయ అర్ధ శతకం సాధించాడు. కేవలం 30 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 63 పరుగులు సాధించాడు.
Ball by ball highlights of AB de Villiers' 63*(30) vs India legends. Still got it.🐐pic.twitter.com/8S1sty9lKU
— . (@ABDszn17) July 22, 2025
భారీ స్కోరు
మిగతావాళ్లలో స్మట్స్ (17 బంతుల్లో 30), వాన్ విక్ (5 బంతుల్లో 18) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సౌతాఫ్రికా చాంపియన్స్ ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 208 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.
ఇండియా చాంపియన్స్ బౌలర్లలో పీయూశ్ చావ్లా, యూసఫ్ పఠాన్ రెండేసి వికెట్లు తీయగా.. అభిమన్యు మిథున్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక లక్ష్య ఛేదనలో ఇండియా చాంపియన్స్ చేతులెత్తేసింది. ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (2), శిఖర్ ధావన్ (1) పూర్తిగా విఫలం కాగా.. సురేశ్ రైనా (16), అంబటి రాయుడు (0) నిరాశపరిచారు.
బిన్నీ ఒక్కడే.. యువీ గాయం వల్ల
ఈ క్రమంలో స్టువర్ట్ బిన్నీ (39 బంతుల్లో 37 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన వారిలో యూసఫ్ పఠాన్ (5) విఫలం కాగా.. ఇర్ఫాన్ పఠాన్ (10), పీయూశ్ చావ్లా (9), పవన్ నేగి (0), వినయ్ కుమార్ (13) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. మరోవైపు.. కెప్టెన్ యువరాజ్ సింగ్ గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు.
ఈ నేపథ్యంలో 18.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన ఇండియా చాంపియన్స్ 111 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్ వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో డీఎల్‌ఎస్ పద్ధతిలో సౌతాఫ్రికా 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో రెండో విజయం నమోదు చేసి నాలుగు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
చివరన యువీ సేన
మరోవైపు.. ఇండియా చాంపియన్స్ పాకిస్తాన్‌తో ఆడాల్సిన తొలి మ్యాచ్‌ను రద్దు చేసుకోగా ఒక పాయింట్ వచ్చింది. తాజా మ్యాచ్‌లో ఓటమి కారణంగా ఆరుజట్ల టోర్నీలో యువీ సేన ప్రస్తుతం ఆఖరి స్థానంలో ఉంది.
కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో కూడిన జట్లతో.. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ టీ20 టోర్నమెంట్లో భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగింది. తొలి సీజన్‌లో యువీ సేన ఫైనల్లో పాక్‌ను ఓడించి గెలుపొందిన విషయం తెలిసిందే.
చదవండి: రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదెలా సాధ్యమైందంటే?