IND Vs ENG: ఇంగ్లండ్‌ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత జట్టు.. సిరీస్‌ కైవసం | India Clinch ODI Series In England With 2-1, Check Score Details And Viral Videos Inside | Sakshi
Sakshi News home page

IND Vs ENG: ఇంగ్లండ్‌ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత జట్టు.. సిరీస్‌ కైవసం

Jul 23 2025 8:18 AM | Updated on Jul 23 2025 9:02 AM

India Clinch ODI Series In England With 2-1

చెస్టర్‌ లీ స్ట్రీట్‌: ఇంగ్లాండ్‌లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. ఇంగ్లండ్‌ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్‌ చేజిక్కించుకున్న జోష్‌లో వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఆఖరి మూడో వన్డేలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (102; 84 బంతుల్లో 14×4) మెరుపు శతకానికి క్రాంతి గౌడ్‌ (6/52) సూపర్‌ బౌలింగ్‌ తోడవడంతో భారత్‌ 13 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. 319 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఇంగ్లాండ్‌ 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది.

వన్డే సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఓపెనర్లు స్మృతి మంధాన (45), ప్రతీక రావల్‌ (26) తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ఇద్దరూ కొద్ది తేడాలో ఔటయ్యారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (84 బంతుల్లో 102; 14 ఫోర్లు) మెరుపు శతకంతో చెలరేగింది. ప్రతీక అవుటయ్యాక వచ్చిన హర్లీన్‌ డియోల్‌ (45; 4 ఫోర్లు) కూడా నింపాదిగా ఆడటంతో భారత్‌ స్కోరు సాఫీగా సాగిపోయింది. టాపార్డర్‌ బ్యాటర్లు ఔటయ్యే సమయానికే భారత్‌ 162/3 స్కోరు వద్ద పటిష్టస్థితిలో నిలిచింది.

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్‌ (50; 7 ఫోర్లు) క్రీజులోకి వచ్చాక స్కోరులో వేగం పెరిగింది. ఇద్దరు చకచకా పరుగులు చక్కబెట్టే పనిలో సఫలమయ్యారు. బౌండరీలతో ధాటిని ప్రదర్శించారు. దీంతో హర్మన్‌ 54 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 41వ ఓవర్లోనే జట్టు స్కోరు 200 దాటింది. అనంతరం జెమీమా 44 బంతుల్లో అర్ధసెంచరీ సాధించింది. కానీ అదేస్కోరు వద్ద ఆమె ఆట ముగియడంతో నాలుగో వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అర్ధసెంచరీ తర్వాత హర్మన్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో రెండో ఫిఫ్టీని చేసేందుకు కేవలం 28 బంతులే అవసరమయ్యాయి. తద్వారా 82 బంతుల్లోనే ఆమె సెంచరీ పూర్తయ్యింది.

వన్డేల్లో హర్మన్‌కిది ఏడో సెంచరీ..
వన్డేల్లో హర్మన్‌ప్రీత్‌కు ఇది ఏడో సెంచరీ కాగా... మిథాలీ రాజ్, స్మృతి మంధాన తర్వాత 4000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత బ్యాటర్‌గా ఘనతకెక్కింది. స్కోరు పెంచే క్రమంలో హర్మన్‌  నిష్క్రమించగా... ఆఖర్లో రిచా ఘోష్‌ (18 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేసింది. దీంతో భారత్‌ 300 పైచిలుకు స్కోరును చేయగలిగింది. 318 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు.. 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో నాట్‌ సీవర్‌ (98; 105 బంతుల్లో 11×4) గొప్పగా ఆడినా.. ఇంగ్లాండ్‌ను గెలిపించలేకపోయింది. ఎమ్మా లాంబ్‌ (68), అలిస్‌ (44) రాణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement