
2024 టి20 ప్రపంచకప్‌లో ప్రదర్శనకు పట్టం
జై షా చేతుల మీదుగా పురస్కారం అందుకున్న యూఎస్ క్రికెట్ చైర్మన్ వేణు, సీఈఓ అట్కిన్‌సన్
సింగపూర్: గతేడాది జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 ప్రపంచకప్‌లో సత్తా చాటిన అమెరికా జట్టుకు అవార్డు దక్కింది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన అమెరికా జట్టు... ప్రపంచ మాజీ చాంపియన్ పాకిస్తాన్‌ను ఇంటిబాట పట్టించడంతో పాటు కెనడాపై ఘనవిజయం సాధించి ‘సూపర్–8’ దశకు చేరింది. ఈ ప్రదర్శనతో అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ పెరగగా... తాజాగా దీనికి ‘ఐసీసీ అసోసియేట్ మెంబర్స్ పురుషుల టీమ్ పెర్ఫార్మెన్స్’ అవార్డు దక్కింది.
ఐసీసీ చైర్మన్ జై షా చేతుల మీదుగా యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) క్రికెట్ చైర్మన్ వేణు కుమార్ రెడ్డి పిసికె, సీఈఓ జొనాథన్ అట్కిన్‌సన్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. నల్లగొండకు చెందిన వేణు పిసికె 1998లో ఐటీ నిపుణుడిగా అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు అమెరికాలో క్రికెట్ ఆటకు ప్రాచుర్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. గత ఆరేళ్లుగా అమెరికాలో క్రికెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు.
ఇక అమెరికాతోపాటు 2024లో ఆయా అసోసియేట్ జట్లు కనబరిచిన ప్రదర్శన ఆధారంగా మొత్తం 8 దేశాలకు ఐసీసీ అవార్డులు ప్రకటించింది. అమెరికాతో పాటు... భూటాన్, నేపాల్, ఇండోనేసియా, నమీబియా, స్కాట్లాండ్, టాంజానియా, వనూతు ఉన్నాయి. మొదట 15 దేశాలను పురస్కారాల కోసం షార్ట్‌లిస్ట్ చేయగా... వాటిలో ఎనిమిది దేశాలు అవార్డులు గెలుచుకున్నాయి. నమీబియాలో క్రికెట్ వృద్ధికి గానూ ఆ దేశ బోర్డుకు ‘ఐసీసీ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం లభించింది. మహిళల విభాగంలో ఈ అవార్డును రెండు దేశాలు పంచుకున్నాయి.
భూటాన్ క్రికెట్ కౌన్సిల్, వనూతు క్రికెట్ సంఘానికి ఉమ్మడిగా ఈ పురస్కారం దక్కింది. నేపాల్ క్రికెట్ సంఘానికి ‘ఐసీసీ డిజిటల్ ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి వివిధ సామాజిక మాధ్యమాల్లో ఆటకు మరింత ప్రచారం చేస్తున్నందుకు గానూ ఈ పురస్కారం దక్కింది. ‘ఐసీసీ డెవలప్‌మెంట్ అవార్డులు ప్రకటించడం ఆనందంగా ఉంది. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయడంలో పురస్కార విజేతలు విశేష కృషి చేశారు’ అని ఐసీసీ అధ్యక్షుడు జై షా వెల్లడించారు.