
నేటి నుంచి ఇంగ్లండ్‌తో భారత్ నాలుగో టెస్టు
సిరీస్ కాపాడుకునే ప్రయత్నంలో టీమిండియా
సొంతగడ్డపై దూకుడు మీదున్న స్టోక్స్ బృందం
మధ్యాహ్నం గం. 3:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ సిరీస్‌లో జరిగిన మూడు టెస్టులూ ఆసక్తికరంగా సాగాయి. మొత్తం 15 సెషన్ల పాటు కూడా ఆట నడిచింది. టీమిండియా కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఎక్కడా తగ్గకపోయినా కొన్ని కీలక సందర్భాల్లో తమకు వచ్చిన అవకాశాలను వృథా చేసుకుంది. ఫలితంగా ఇప్పుడు సిరీస్‌లో వెనుకబడింది.
అయితే ఆటతీరులో, పోరాటంలో ఆతిథ్య జట్టుతో సమానంగా ఉన్న గిల్ బృందం కోలుకొని సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. లార్డ్స్‌లో విజయాన్ని అందుకున్న ఇంగ్లండ్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో పోరుకు రంగం సిద్ధమైంది.
మాంచెస్టర్: ఇంగ్లండ్ గడ్డపై గత నాలుగు టెస్టు సిరీస్‌లను కూడా కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు మరో సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నేటి నుంచి జరిగే నాలుగో టెస్టులో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఇక్కడా ఓడితే సిరీస్ భారత్ చేజారుతుంది.
అయితే రెండో టెస్టు తరహాలో సత్తా చాటి పైచేయి సాధిస్తే సిరీస్ ఫలితం చివరి మ్యాచ్‌కు చేరుతుంది. ఇంగ్లండ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, బౌలర్ల గాయాలు గిల్ బృందానికి సమస్యగా మారాయి. ఈ గ్రౌండ్‌లో పేలవ రికార్డు (0–4) ఉన్నా... స్థాయికి తగినట్లుగా చెలరేగితే భారత్ గత రికార్డులు మార్చివేయగలదు.
అన్షుల్ అరంగేట్రం!
ఆటగాళ్లు గాయపడటంతో భారత తుది జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. గత రెండు టెస్టుల్లో అనుసరించిన వ్యూహాన్ని కూడా జట్టు మార్చుకోనుంది. లార్డ్స్‌లో ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్‌దీప్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. బుమ్రా, సిరాజ్‌లతో పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండగా ఆకాశ్‌దీప్ స్థానంలో అదే తరహా బౌలింగ్ శైలి ఉన్న కొత్త పేసర్ అన్షుల్ కంబోజ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కెప్టెన్ గిల్ చెప్పినట్లుగా మూడో పేసర్‌గా అన్షుల్‌తో పాటు ప్రసిధ్ కూడా పోటీలో ఉన్నాడు.
ఇక్కడి పిచ్ స్పిన్‌కు పెద్దగా అనుకూలించే అవకాశం లేకపోవడంతో సుందర్ స్థానంలో శార్దుల్‌ను ఆడించే విషయాన్ని జట్టు పరిశీలిస్తోంది. ఇక టాప్–6 బ్యాటింగ్ విషయంలో పూర్తి స్పష్టత వచ్చేసింది. నితీశ్ స్థానంలో రెగ్యులర్ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు అవకాశం దక్కనుంది. వరుసగా విఫలమవుతున్నా... టీమ్ మేనేజ్‌మెంట్ కరుణ్ నాయర్‌కు మరో అవకాశం ఇస్తోంది. అతను తన రెగ్యులర్ స్థానమైన ఆరులో బ్యాటింగ్‌కు రానున్నాడు.
యశస్వి, రాహుల్ మరోసారి శుభారంభం అందించాల్సి ఉంది. సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన గిల్ గత మ్యాచ్ వైఫల్యాన్ని మరచి చెలరేగితే భారీ స్కోరు ఖాయం. లార్డ్స్‌లో పంత్ రనౌట్ మ్యాచ్ గమనాన్ని మార్చింది. అతను ఈ సారి అలాంటి తప్పులు చేయకుండా ఆడాలని జట్టు కోరుకుంటోంది. పంత్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు కాబట్టి కీపింగ్ కూడా చేస్తాడని గిల్ ఇప్పటికే స్పష్టం చేశాడు. నాలుగు వరుస హాఫ్ సెంచరీలతో జడేజా ఫామ్‌లో ఉండటం జట్టుకు సానుకూలాంశం.
డాసన్ ఎనిమిదేళ్ల తర్వాత...
ఇంగ్లండ్ ఎప్పటిలాగే రెండు రోజుల ముందే తమ తుది జట్టును ప్రకటించింది. భారత్‌తో పోలిస్తే ఇంగ్లండ్ బ్యాటింగ్ బలహీనంగానే కనిపిస్తోంది. టాప్–3 ఆశించిన ప్రభావం చూపలేకపోతున్నా క్రాలీ, డకెట్, పోప్‌లపై మేనేజ్‌మెంట్ ఇంకా నమ్మకముంచింది. 57 టెస్టుల తర్వాత కూడా 30 సగటుతో క్రాలీ ఇంకా జట్టులో కొనసాగడం ఆశ్చర్యకరం! దాంతో ప్రధాన బ్యాటర్లయిన రూట్, బ్రూక్‌పై బ్యాటింగ్ భారం పడుతోంది. కీపర్ స్మిత్ రూపంలో ఇంగ్లండ్‌తో సమర్థుడైన బ్యాటర్ లభించాడు.
అసాధారణ బౌలింగ్‌తో పాటు నాయకుడిగా కూడా అద్భుతంగా నడిపిస్తున్న స్టోక్స్ బ్యాటింగ్ మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ఆరు ఇన్నింగ్స్‌లలో అతను ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఇక్కడైనా స్టోక్స్ రాణించడం అవసరం.
లెఫ్టార్మ్ స్పిన్నర్ డాసన్ ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 18 సెంచరీలు ఉన్న అతని బ్యాటింగ్ జట్టుకు అదనపు బలం. వోక్స్, కార్స్, ఆర్చర్‌లతో పేస్ దళం పటిష్టంగా ఉంది. ముఖ్యంగా ఆర్చర్ లార్డ్స్ భారత్‌ను ఇబ్బంది పెట్టడంలో సఫలమయ్యాడు.
04 ఇంగ్లండ్‌లో ఇతర మైదానాలతో పోలిస్తే ఓల్డ్‌ట్రఫోర్డ్‌లో భారత్ తక్కువ మ్యాచ్‌లు ఆడింది. 1936–2014 మధ్య 9 టెస్టులు ఆడగా ఒక్కటీ గెలవలేదు. 4 ఓడి మరో 5 డ్రా చేసుకుంది.
పిచ్, వాతావరణం
గత మూడు టెస్టులతో పోలిస్తే ఇది వేగవంతమైన పిచ్. చక్కటి బౌన్స్ ఉంది. గత వారం రోజులుగా వానలు కురుస్తున్నాయి. తేమ కారణంగా తొలి రోజు పేస్ బౌలింగ్‌కు అనుకూలించవచ్చు. మ్యాచ్ జరిగే రోజుల్లోనూ వర్ష సూచన ఉంది.
తుది జట్ల వివరాలు:
భారత్ (అంచనా): గిల్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, పంత్, కరుణ్ నాయర్, జడేజా, సుందర్/ శార్దుల్, సిరాజ్, ప్రసిధ్/ కంబోజ్
ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్, డాసన్, వోక్స్, కార్స్, ఆర్చర్.