
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుతో ఇవాళ (జులై 22) జరుగుతున్న నిర్ణయాత్మక చివరి వన్డేలో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెలరేగిపోయింది.
ఈ మ్యాచ్‌లో హర్మన్ కేవలం 82 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, భారత్ తరఫున వన్డేల్లో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేసింది. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఈ మ్యాచ్‌లో మొత్తంగా 84 బంతులు ఎదుర్కొన్న హర్మన్ 14 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి ఔటైంది. హర్మన్‌తో పాటు భారత ఇన్నింగ్స్‌లో జెమీమా రోడ్రిగెజ్ (50), స్మృతి మంధన (45), హర్లీన్ డియోల్ (45), రిచా ఘోష్ (38 నాటౌట్), ప్రతిక రావల్ (26) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
భారత బ్యాటర్ల ధాటికి ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. సోఫీ ఎక్లెస్టోన్ (10-2-28-1) మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. లారెన్ బెల్ 10 ఓవర్లలో 82, లారెన్ ఫైలర్ 10 ఓవర్లలో 64, చార్లోట్ డీన్ 10 ఓవర్లలో 69, లిన్సే స్మిత్ 10 ఓవర్లలో 74 పరుగులు సమర్పించుకొని తలో వికెట్ తీశారు.
భారత్ తరఫున అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీలు..
70 స్మృతి మంధన vs ఐర్లాండ్ రాజ్‌కోట్ 2025
82 హర్మన్‌ప్రీత్ కౌర్ vs ఇంగ్లాండ్ చెస్టర్-లీ-స్ట్రీట్ 2025
85 హర్మన్‌ప్రీత్ కౌర్ vs దక్షిణాఫ్రికా బెంగళూరు 2024
89 జెమిమా రోడ్రిగ్స్ vs దక్షిణాఫ్రికా కొలంబో RPS 2025
ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్ సొంతమవుతుంది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగగా, భారత్ 3-2 తేడాతో ఆ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది.