
విజయం దిశగా భారత మహిళల జట్టు
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 258/6
సౌతాంప్టన్: ఇంగ్లండ్ మహిళలతో టి20 సిరీస్‌ను గెలుచుకున్న భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌లో శుభారంభంపై దృష్టి పెట్టింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... కడపటి వార్తలందేసరికి 45 ఓవర్లలో 6 వికెట్లకు 232 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (54 బంతుల్లో 48; 5 ఫోర్లు), దీప్తి శర్మ (57 బంతుల్లో 57 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 86బంతుల్లో 90 పరుగులు జోడించారు.
అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ‘బర్త్‌డే గర్ల్’ సోఫియా డంక్లీ (92 బంతుల్లో 83; 9 ఫోర్లు), అలైస్ డేవిడ్సన్ (73 బంతుల్లో 53; 2 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
శతక భాగస్వామ్యం...
భారత పేసర్, మధ్యప్రదేశ్‌కు చెందిన క్రాంతి గౌడ్ ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను కట్టడి చేసింది. తన తొలి ఓవర్లోనే ఎమీ జోన్స్ (1)ను బౌల్డ్ చేసిన ఆమె, తన తర్వాతి ఓవర్లో బీమాంట్ (5)ను ఎల్బీగా పంపడంతో ఇంగ్లండ్ స్కోరు 20/2 వద్ద నిలిచింది. ఈ దశలో నాట్ సివర్ బ్రంట్ (52 బంతుల్లో 41; 5 ఫోర్లు), ఎమా ల్యాంబ్ (50 బంతుల్లో 39; 4 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు.
వీరిద్దరు మూడో వికెట్‌కు 87 బంతుల్లో 71 జత చేశారు. అయితే ఆఫ్‌స్పిన్నర్ స్నేహ్ రాణా ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టింది. తన వరుస ఓవర్లలో ఆమె ల్యాంబ్, నాట్ సివర్‌లను పెవిలియన్‌కు పంపించడంతో భారత్ పైచేయి సాధించింది. అయితే డంక్లీ, అలైస్ చక్కటి బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరు ఐదో వికెట్‌కు 23.4 ఓవర్లలో 106 పరుగులు జోడించారు.
ఎట్టకేలకు అలైస్‌ను అవుట్ చేసి ఆంధ్ర బౌలర్ శ్రీచరణి ఈ జోడీని విడగొట్టింది. చివర్లో సోఫీ ఎకెల్‌స్టోన్ (19 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) వేగంగా ఆడటంతో స్కోరు 250 దాటింది. ఆఖరి 5 ఓవర్లలో ఇంగ్లండ్ 49 పరుగులు సాధించింది. భారత ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు వదిలేయడం కూడా ప్రత్యర్థికి కలిసొచ్చింది.
కెప్టెన్ విఫలం...
ఛేదనను భారత ఓపెనర్లు ధాటిగా మొదలు పెట్టారు. తొలి వికెట్‌కు ప్రతీక రావల్ (51 బంతుల్లో 36; 3 ఫోర్లు)తో కలిసి 8 ఓవర్లలోనే 48 పరుగులు జోడించిన అనంతరం స్మృతి మంధాన (24 బంతుల్లో 28; 5 ఫోర్లు) వెనుదిరిగింది. ఆ తర్వాత 8 పరుగుల వ్యవధిలో ప్రతీక, హర్లీన్ డియోల్ (44 బంతుల్లో 27; 4 ఫోర్లు) పెవిలియన్ చేరారు. నిర్లక్ష్యంగా పరుగెత్తిన హర్లీన్ అనూహ్యంగా రనౌటైంది. అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17) విఫలమైంది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బీమాంట్ (ఎల్బీ) (బి) క్రాంతి 5; ఎమీ జోన్స్ (బి) క్రాంతి 1; ఎమా ల్యాంబ్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) రాణా 39; నాట్ సివర్ (సి) జెమీమా (బి) రాణా 41; డంక్లీ (బి) అమన్‌జోత్ 83; అలైస్ డేవిడ్సన్ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) శ్రీచరణి 53; ఎకెల్‌స్టోన్ (నాటౌట్) 23; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 258. వికెట్ల పతనం: 1–8, 2–20, 3–91, 4–97, 5–203, 6–258. బౌలింగ్: అమన్‌జోత్ 10–0–58–1, క్రాంతి గౌడ్ 9–0–55–2, దీప్తి శర్మ 10–0–58–0, శ్రీచరణి 10–0–46–1, స్నేహ్ రాణా 10–0–31–2, ప్రతీక 1–0–7–0.