30 జట్లు... 464 మంది క్రీడాకారిణులు...పలువురు అంతర్జాతీయ స్టార్స్... తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హైదరాబాద్ విచ్చేశారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జాతీయ సీనియర్ మహిళల కబడ్డీ చాంపియన్‌షిప్ ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్ జరగనుంది. తొలి రోజు జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో రాజస్తాన్ 44–21తో తెలంగాణపై, ఢిల్లీ 61–14తో జమ్మూ కశ్మీర్‌పై, హిమాచల్‌ప్రదేశ్ 49–24తో అస్సాంపై, హరియాణా 62–16తో జార్ఖండ్‌పై నెగ్గాయి.
తెలంగాణ జట్టుకు మహేశ్వరి కెప్టెన్‌గా, గట్టయ్య, బండారి మాధవి కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభోత్సవంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని వీరేశ్ ముదిరాజ్, కాసాని జ్ఞానేశ్వర్, జగదీశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నీలో రాణించిన క్రీడాకారిణులను ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో, కబడ్డీ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు ప్రాబబుల్స్‌గా ఎంపిక చేస్తారు.


