శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు బ్రిటన్‌లో సంచలనంగా మారాయి. ఇంగ్లండ్ వేల్స్ పోలీస్ ఫెడరేషన్ తాజా నివేదిక ప్రకారం.. గత మూడేళ్లలో దాదాపు 100 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నారు.
అంతేకాకుండా 200 కంటే ఎక్కువ మంది అధికారులు ఆత్మహత్యయాత్నం చేశారంట. దీన్ని ఇంగ్లండ్ వేల్స్ పోలీస్ ఫెడరేషన్ నిశ్శబ్ద విపత్తుగా అభివర్ణించింది. దీనిని అరికట్టడానికి #CoppedEnough అనే నిరసన కార్యక్రమాన్ని పోలీస్ ఫెడరేషన్ చేపట్టింది.
అయితే ఆత్మహత్య చేసుకున్న వారిలో అత్యధిక మంది ఏదో ఒక రకమైన శాఖాపరమైన విచారణలు ఎదుర్కొంటున్నవారే కావడం గమనార్హం. చిన్నచిన్న కారణాలకు కూడా విచారణలను ఏళ్ల తరబడి సాగదీయడం వల్ల అధికారులు మనస్తాపానికి గురువుతన్నట్లు ఇంగ్లండ్ వేల్స్ పోలీస్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది.
ఈ ఆత్మహత్యలను కట్టడి చేసేందుకు ఫెడరేషన్ కొన్ని కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. అధికారులపై జరిగే క్రమశిక్షణ విచారణలను గరిష్టంగా ఒక ఏడాది లోపే పూర్తి చేయాలని సూచించింది. ప్రతి పోలీసు అధికారి ఆత్మహత్యను ఖచ్చితంగా రికార్డ్ చేసేలా చట్టం తీసుకురావాలని ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.


