తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓటమి
కొలంబో: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన శ్రీలంక జట్టు తొలి వన్డేలో 19 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.
కుశాల్ మెండిస్ (117 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు) సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోగా... జనిత్ లియనాగె (53 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తలా కొన్ని పరుగులు చేయడంతో లంక మంచి స్కోరు చేయగలిగింది. కమిల్ మిశ్రా (27), నిసాంక (21), కెపె్టన్ అసలంక (17), దునిత్ వెల్లలాగె (25 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్), జో రూట్ (90 బంతుల్లో 61; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో పోరాడారు. ఈ ఇద్దరూ రాణించడంతో ఒక దశలో 129/1తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.
కెప్టెన్ హ్యారీ బ్రూక్ (6), జాక్ క్రాలీ (6), జోస్ బట్లర్ (19), సామ్ కరన్ (5) విఫలమయ్యారు. జేమీ ఓవర్టన్ (17 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రేహాన్ అహ్మద్ (27; 5 ఫోర్లు) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. లంక బౌలర్లలో ప్రమోద్ 3 వికెట్లు పడగొట్టగా... దునిత్, జెఫ్రీ వండర్సె చెరో రెండు వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన దునిత్ వెల్లలాగెకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరగనుంది.


