రెండోసారి హాకీ ఇండియా లీగ్ ట్రోఫీ కైవసం
ఫైనల్లో రాంచీ రాయల్స్‌పై గెలుపు
హైదరాబాద్ తూఫాన్స్‌కు మూడో స్థానం
భువనేశ్వర్: పురుషుల హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో కళింగ లాన్సర్స్ రెండోసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో కళింగ లాన్సర్స్ జట్టు 3–2 గోల్స్ తేడాతో రాంచీ రాయల్స్‌పై గెలుపొంది 2017 తర్వాత మళ్లీ టైటిల్ సాధించింది. కళింగ లాన్సర్స్ తరఫున అలెగ్జాండ్రా హెండ్రిక్స్ (4వ, 27వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో సత్తా చాటగా... దిల్‌ప్రీత్ సింగ్ (25వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. రాంచీ రాయల్స్ తరఫున అరిజీత్ సింగ్ హండల్ (9వ నిమిషంలో), టామ్ బూన్ (59వ నిమిషంలో) ఒక్కో గోల్ కొట్టారు.
ఫైనల్ కంటే ముందు నిర్వహించిన వర్గీకరణ మ్యాచ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ 4–3 గోల్స్ తేడాతో హెచ్‌ఐఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జట్టుపై విజయం సాధించి మూడో స్థానం దక్కించుకుంది. హైదరాబాద్ తూఫాన్స్ తరఫున అమన్‌దీప్ లక్రా (30వ, 53వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా... నీలకంఠ శర్మ (24వ నిమిషంలో), జాకబ్ అండర్సన్ (33వ నిమిషంలో) చెరో గోల్ కొట్టారు. హెచ్‌ఐఎల్ గవర్నింగ్ కౌన్సిల్ టీమ్ తరఫున సామ్ వర్డ్ (14వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్... కేర్ రసెల్ (55వ నిమిషంలో) ఓ గోల్ సాధించాడు.
విజేతగా నిలిచిన కళింగ లాన్సర్స్‌కు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్‌గా నిలిచిన రాంచీ రాయల్స్‌కు రూ. 2 కోట్లు దక్కాయి. మూడో స్థానం దక్కించుకున్న హైదరాబాద్ తూఫాన్స్‌కు కోటి రూపాయల నగదు బహుమతి లభించింది. హెచ్‌ఐఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జట్టుకు ‘ఫెయిర్ ప్లే’ అవార్డు దక్కింది. తమిళనాడు డ్రాగన్స్ గోల్‌కీపర్ ప్రిన్స్ దీప్ సింగ్‌కు ‘బెస్ట్ గోల్ కీపర్’ అవార్డు లభించింది.
హెచ్‌ఐఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జట్టు సభ్యుడైన టాలెమ్ ప్రియోబర్టా ‘అప్‌కమింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు దక్కించుకున్నాడు. వీరిద్దరికీ రూ. 10 లక్షల చొప్పున నగదు పురస్కారం లభించింది. రాంచీ రాయల్స్ కెపె్టన్ టామ్ బూన్ ఈ టోర్నీలో అత్యధిక (19) గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచి ‘టాప్ స్కోరర్’ ట్రోఫీతో పాటు రూ. 10 లక్షల బహుమతి అందుకున్నాడు. హైదరాబాద్ తూఫాన్స్ ప్లేయర్ అమన్‌దీప్ లక్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డుతో పాటు రూ. 20 లక్షల నగదు బహుమతి లభించింది.


