
నోయిడా: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) 2026 సీజన్ వచ్చే ఏడాది జనవరి 5న ప్రారంభం కానుంది. ఈ మేరకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) కార్యదర్శి భోళానాథ్ సింగ్ వివరాలు వెల్లడించారు. ఏడేళ్ల విరామం తర్వాత గతేడాది తిరిగి నిర్వహించిన హెచ్‌ఐఎల్‌కు మంచి ఆదరణ లభించగా ఈసారి మహిళల లీగ్‌లో మరో రెండు జట్లను పెంచనున్నట్లు భోళానాథ్ తెలిపారు.
‘హెచ్‌ఐఎల్ (HIL 2026) వచ్చే సీజన్ తేదీలు ఖరారయ్యాయి. పురుషుల విభాగంలో 8 ఫ్రాంఛైజీలు యథావిథిగా పాల్గొంటుండగా... మహిళల విభాగంలో గత సీజన్‌లో పాల్గొన్న నాలుగు జట్లతో పాటు మరో రెండు జట్లు అదనంగా చేరనున్నాయి. వేదిక ఇంకా ఖరారు కాలేదు. విదేశీ ఆటగాళ్ల వెసులుబాటుకు తగ్గట్లే షెడ్యూల్‌ను జనవరి 5 నుంచి ప్రారంభిస్తున్నాం’ అని భోళానాథ్ వెల్లడించారు.
ఇక గత సీజన్‌కు సంబంధించి కొంత మంది ప్లేయర్లకు డబ్బులు చెల్లించలేదనే వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఫ్రాంఛైజీలన్నీ హెచ్‌ఐఎల్ నియమావళిని పాటిస్తున్నాయని తెలిపారు. హాకీ ప్లేయర్లు (Hockey Players) చదువు కొనసాగించేందుకు వీలుగా అమిటీ యూనివర్సిటీతో హాకీ ఇండియా ఎంఓయూ కుదుర్చుకుంది. దీని ద్వారా ప్లేయర్లు ఎక్కడి నుంచి అయినా ఆన్‌లైన్ ద్వారా తమ చదువు కొనసాగించే అవకాశం దక్కింది.
కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం
మరోవైపు భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న ఆసియా కప్ హాకీ (Asia Cup Hockey) టోర్నమెంట్‌లో పాకిస్తాన్ పాల్గొనే అంశంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే అని హాకీ ఇండియా వెల్లడించింది. ప్రభుత్వం సూచనల మేరకే నడుచుకుంటామని వెల్లడించింది.
చదవండి: ప్రొ హాకీ లీగ్‌కు భారత్ జట్టు ప్రకటన