భువనేశ్వర్: పురుషుల హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో వేదాంత కళింగ లాన్సర్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కళింగ లాన్సర్స్ జట్టు 2–1 గోల్స్‌తో రాంచీ రాయల్స్‌పై గెలుపొందడంతో నేరుగా టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. కళింగ తరఫున అలెగ్జాండర్ హెండ్రిక్స్ (12వ, 32వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా, రాంచీ రాయల్స్ జట్టులో మన్‌దీప్ సింగ్ 40వ నిమిషంలో గోల్ చేశాడు.
రాంచీకి ఫైనల్ చేరే అర్హత రెండో క్వాలిఫయర్ రూపంలో ఇంకా సజీవంగానే ఉంది. ఆదివారం ఫైనల్ బెర్త్ లక్ష్యంగా రాంచీతో హైదరాబాద్ తుఫాన్స్ తలపడుతుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుతో ఆదివారం జరిగే ఫైనల్లో కళింగ లాన్సర్స్ అమీతుమీ తేల్చుకుంటుంది. మరోవైపు గత ఏడాది రన్నరప్ హైదరాబాద్ తుఫాన్స్ జట్టు రెండో క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది.
శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ పోరులో హైదరాబాద్ జట్టు 2–0తో హెచ్‌ఐఎల్ జీసీ జట్టుపై విజయం సాధించింది. తుఫాన్స్ స్ట్రయికర్ శిలానంద్ లాక్రా అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టాడు. అతను 16వ, 39వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించాడు. హైదరాబాద్ గోల్‌కీపర్ జీన్ పాల్ డానెబర్గ్ ప్రత్యర్థి గోల్స్ చేయకుండా అడ్డుగోడ కట్టేశాడు.


