
బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చింది. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకొని ఫ్యూజులు ఎగురగొట్టింది. ఇవాళ (జులై 22) ఢాకాలో జరిగిన రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగిపోయారు. 134 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకున్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ బౌలర్లు సైతం అద్భుతంగా కట్టడి చేశారు. సల్మాన్ మీర్జా (4-1-17-2), అబ్బాస్ అఫ్రిది (4-0-37-2), అహ్మద్ దనియాల్ (4-0-23-2), ఫహీమ్ అష్రాఫ్ (3-0-20-1), మొహమ్మద్ నవాజ్ (3-0-19-1) చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్ 133 పరుగులకే ఆలౌటైంది. జాకెర్ అలీ (55), మెహిది హసన్ (33) అద్బుతంగా పోరాడి బంగ్లాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు బంగ్లా బౌలర్లు చుక్కలు చూపించారు. వీరి ధాటికి పాకిస్తాన్ 47 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం దిశగా సాగింది. ఈ దశలో ఫహీమ్ అష్రాఫ్ (51) వీరోచితంగా పోరాడి పాక్‌ను గెలిపించే ప్రయత్నం చేశాడు.
అయితే బంగ్లా బౌలర్లు మరోసారి చెలరేగి పాక్‌ను 125 పరుగులకే పరిమితం చేశారు. మెహిది హసన్ (4-0-25-2), షొరిఫుల్ ఇస్లాం (4-0-17-3), తంజిమ్ హసన్ సకీబ్ (4-0-23-2), ముస్తాఫిజుర్ (3.2-0-15-1), రిషద్ హొసేన్ (4-0-42-1) పాక్ బ్యాటర్ల భరతం పట్టారు.ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 జులై 24న జరుగనుంది.