
ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) వ్యవహార శైలి విమర్శలకు దారితీసింది. ఆతిథ్య జట్టు ఓపెనర్ జాక్ క్రాలీని అభ్యంతరకర పదాలతో దూషించడం సరికాదని భారత మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు. గత మ్యాచ్‌లో ఓటమితో కుంగిపోయిన ఇంగ్లండ్ జట్టులో.. గిల్ తీరు కసిని పెంచిందని.. అందుకు టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందనే విమర్శలూ వచ్చాయి.
ఇంగ్లండ్ ఓపెనర్లపై ఆగ్రహం
కాగా లార్డ్స్ (Lord's Test)లో రెండో ఇన్నింగ్స్ కోసం మైదానంలోకి వచ్చిన ఇంగ్లండ్ బ్యాటర్లు ఉద్దేశపూర్వకంగా ఆటను ఆలస్యం చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా భారత్ నిర్ణీత వ్యవధిలో రెండు ఓవర్లు కాకుండా ఒకే ఓవర్ మాత్రమే వేయగలిగింది. దాంతో గిల్ సహా ఇతర భారత ఆటగాళ్లంతా ఇంగ్లండ్ ఓపెనర్లపై ఆగ్రహం ప్రదర్శించారు.
అభ్యంతరకర పదాలు కూడా
గిల్ మరింత ముందుకు వెళ్లి కాస్త అభ్యంతరకర పదాలు కూడా వాడాడు. ఈ నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తగా లార్డ్స్ టెస్టు మ్యాచ్ చివర్లో సాగిన డ్రామా గురించి శుబ్‌మన్ గిల్ తాజాగా స్పష్టతనిచ్చాడు. ‘అందరూ దీని గురించి నన్ను అడుగుతున్నారు కాబట్టి ఒకేసారి సమాధానం ఇవ్వాలనుకుంటున్నా.
దేనికైనా ఓ హద్దు ఉంటుంది
ఆ రోజు మరో 7 నిమిషాల ఆట మిగిలి ఉంది. 10 కాదు 20 కాదు ఏకంగా 90 సెకన్లు వారు ఆలస్యంగా క్రీజ్‌లోకి వచ్చారు. అన్ని జట్లూ ఇలా తెలివిని ప్రదర్శించడం సహజమే. మేము కూడా తక్కువ ఓవర్లు ఎదుర్కొంటే బాగుంటుందని కోరుకుంటాం. కానీ దానికీ హద్దు ఉంటుంది. గాయపడితే ఫిజియో రావడంలో సమస్య లేదు.
90 సెకన్లు ఆలస్యం
ఇక్కడ వివాదం జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బంతి తగిలి క్రాలీ చికిత్స తీసుకోవడం కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా 90 సెకన్లు ఆలస్యంగా రావడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం’ అని గిల్ స్పష్టం చేశాడు. మాంచెస్టర్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు (జూలౌఐ 23-27) నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన గిల్ ఈ మేరకు విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.
వెనుకబడిన టీమిండియా
కాగా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ, లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. టీమిండియా తొలిసారిగా ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. అతడి సారథ్యంలోని జట్టు టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా స్టోక్స్ బృందంతో ఐదు టెస్టులు ఆడుతోంది.
లీడ్స్ వేదికగా తొలి టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్ తొలిసారి గెలిచి గిల్ సేన చరిత్ర సృష్టించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు సత్తా చాటింది. అయితే, లార్డ్స్‌లో ఆఖరి వరకు పోరాడినా టీమిండియాకు చేదు అనుభవమే మిగిలింది.
ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో మూడో టెస్టులో గెలిచి సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు.. మాంచెస్టర్‌లో ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు గెలవని టీమిండియా ఈసారి చరిత్రను తిరగరాయాలని పట్టుదలగా ఉంది. అయితే, వర్షం ఈ మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
చదవండి: IND vs ENG: అతడిని కాదని అన్షుల్‌ను ఎలా ఎంపిక చేస్తారు?: సెలక్టర్లపై ఫైర్