WCL 2025: నీకసలు దేశభక్తి ఉందా?.. ఆఫ్రిదితో ముచ్చట్లు పెడతావా? | Did Afridi meet Ajay Devgn on the sidelines of WCL 2025 Event? Here's The Truth | Sakshi
Sakshi News home page

WCL 2025: షాహిద్‌ ఆఫ్రిదితో బాలీవుడ్‌ హీరో ముచ్చట్లు?.. ఫొటోలు వైరల్‌.. ఓ ట్విస్ట్‌

Jul 21 2025 11:00 AM | Updated on Jul 21 2025 11:28 AM

Did Afridi meet Ajay Devgn on the sidelines of WCL 2025 Event? Here's The Truth

ఆఫ్రిదితో అజయ్‌ దేవగణ్‌ (పాత ఫొటోలు PC: X)

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది (Shahid Afridi)- బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgan) కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. క్రికెట్‌ మైదానంలో వీరిద్దరు సరదాగా ముచ్చటించుకుంటూ.. పరస్పరం ఆలింగనం చేసుకున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అజయ్‌ దేవగణ్‌పై భారతీయ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

నీకసలు దేశభక్తి ఉందా?
‘‘నీకసలు దేశభక్తి అనేదే లేదా? ఒకవేళ ఉన్నా సోషల్‌ మీడియా పోస్టులకు మాత్రమే పరిమితం చేస్తావా?’’ అంటూ అజయ్‌ దేవగణ్‌ను భారీ ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫొటోలు, వీడియోలు నిజమైనవేనా? అవును.. ఇవేమీ కృత్రిమ మేధ (AI)తో సృష్టించినవి కాదు. నిజమైనవే. అయితే, గతేడాదికి సంబంధించినవి.

ఇండియా చాంపియన్స్‌ సహ యజమాని
అసలు విషయం ఏమిటంటే.. ఇంగ్లండ్‌ వేదికగా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ (WCL) పేరిట మాజీ క్రికెటర్లతో కూడిన ఆరుజట్లతో టీ20 టోర్నమెంట్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. 

ఇందులో భాగమైన ఇండియా చాంపియన్స్‌ జట్టుకు అజయ్‌ దేవగణ్‌ సహ యజమానిగా ఉన్నాడు. గతేడాది ఈ టోర్నీ మొదలు కాగా.. తొలి ఎడిషన్‌లో యువరాజ్‌ సింగ్‌ సారథ్యంలోని భారత్‌.. ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి ట్రోఫీ గెలిచింది.

భారత్‌ వర్సెస్‌ పాక్‌  మ్యాచ్‌ రద్దు
ఇక WCL రెండోసీజన్‌ శుక్రవారం (జూలై 18)న మొదలుకాగా చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆదివారం (జూలై 20) మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే, పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని కెప్టెన్‌ యువీతో సహా శిఖర్‌ ధావన్‌, సురేశ్‌ రైనా నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

గతేడాది ఫొటోలు ఇవి
ఈ నేపథ్యంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్న ఇంగ్లండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ECB) దాయాదుల పోరును రద్దు చేయాల్సి వచ్చింది. అయితే, అజయ్‌ దేవగణ్‌ మాత్రం.. భారత్‌పై తన వ్యాఖ్యలతో విషం చిమ్మే షాహిద్‌ ఆఫ్రిదిని కలిసినట్లుగా ఉన్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి. కానీ అవి తాజా సీజన్‌కు సంబంధించినవి కావు. గతేడాది ఇరుదేశాలు కలిసి టోర్నీలో ఆడాయి.

అప్పుడే అంటే అరంగేట్ర సీజన్‌ (2024)లో అజయ్‌ ఆఫ్రిదిని కలిశాడు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఫొటోలు మరోసారి తెరమీదకు రాగా.. అజయ్‌ దేవగణ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది జమ్మూకశ్మీర్‌లోని ప్రశాంత పహల్గామ్‌లో ఉగ్రవాదులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. 

ఇందుకు బదులుగా భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట ప్రత్యేక ఆపరేషన్‌తో పాక్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఇందుకు పాక్‌ సైన్యం బదులివ్వగా అనుచిత దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీంతో ఇరుదేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా WCL-2025లో తొలి మ్యాచ్‌ను రద్దు చేసుకున్న యువీ సేన మంగళవారం తమ తదుపరి మ్యాచ్‌ ఆడనుంది. సౌతాఫ్రికా చాంపియన్స్‌తో తలపడనుంది.

చదవండి: WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్‌, బ్రెట్‌ లీ.. షెడ్యూల్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement