సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సురేశ్‌ రైనా.. ప్రకటన విడుదల | Chinna Thala Suresh Raina Set To Make Debut In Tamil Film | Sakshi
Sakshi News home page

సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సురేశ్‌ రైనా.. ప్రకటన విడుదల

Jul 5 2025 2:44 PM | Updated on Jul 5 2025 3:22 PM

Chinna Thala Suresh Raina Set To Make Debut In Tamil Film

టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా (Suresh Raina) కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టనున్నాడు. సినిమా నటుడిగా అవతారం ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని రైనా స్వయంగా వెల్లడించాడు. తాను కోలీవుడ్‌లో నటించనున్నట్లు తెలిపాడు.

ఇందుకు సంబంధించి తమిళ సినిమా నిర్మాణ సంస్థ నుంచి శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. డ్రీమ్‌ నైట్‌ స్టోరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో రైనాకు స్వాగతం పలుకుతున్న వీడియోను క్రికెటర్‌ శివం దూబే చేతుల మీదుగా విడుదల చేశారు.

క్రికెట్‌ మైదానం నుంచి.. కోలీవుడ్‌ ఫ్రేమ్స్‌ దాకా..
ఈ నేపథ్యంలో సురేశ్‌ రైనా స్పందిస్తూ.. ‘‘క్రికెట్‌ మైదానం నుంచి.. కోలీవుడ్‌ ఫ్రేమ్స్‌ దాకా.. చెన్నై నాలో నిండి నన్ను ముందుకు నడిపిస్తోంది. నా ఈ కొత్త ప్రయాణంలో డీకేఎస్‌ సంస్థతో జట్టుకట్టడం ఎంతో గర్వంగా ఉంది’’ అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నాడు. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేశ్‌ రైనా.. 2005 నుంచి 2018 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.

అంతర్జాతీయ స్థాయిలో 226 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్టులు ఆడిన రైనా.. ఆయా ఫార్మాట్లలో 5615, 1604, 768 పరుగులు సాధించాడు. ఇక ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌కు ఐపీఎల్‌లో ఘనమైన రికార్డు ఉంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో మొత్తంగా 205 మ్యాచ్‌లు ఆడిన రైనా.. 5528 పరుగులు సాధించి మిస్టర్‌ ఐపీఎల్‌గా గుర్తింపు పొందాడు.

చిన్న తలాగా అభిమానుల హృదయాల్లో చోటు
ఇక ఐపీఎల్‌ కెరీర్‌లో చాలా ఏళ్ల పాటు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సురేశ్‌ రైనా.. చిన్న తలాగా గుర్తింపు పొందాడు. మహేంద్ర సింగ్‌ ధోని తర్వాత అంతటి స్థాయిలో చెన్నై అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచే తన సినీ ప్రయాణం కూడా మొదలుపెట్టనున్నాడు.

సంతోషంగా ఉంది
తాను తమిళ సినిమా ద్వారా అరంగేట్రం చేయడం గురించి సురేశ్‌ రైనా మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు నా దగ్గరకు వచ్చి కథ చెప్పినపుడు అది నా మనసుకు ఎంతో దగ్గరగా అనిపించింది. క్రికెట్‌కు సంబంధించిన ఈ సినిమాలో నటించడం గర్వకారణం.

అది కూడా ఎన్నో ఏళ్లుగా సీఎస్‌కేకు ఆడి.. తమిళనాడు నుంచి నా సినిమా ప్రయాణం మొదలుపెట్టడం మరింత సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను కురిపించారు’’ అని పేర్కొన్నాడు. కాగా సురేశ్‌ రైనా నటిస్తున్న తమిళ చిత్రానికి లోగాన్‌ దర్శకుడు కాగా.. సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. 

ఇదిలా ఉంటే.. టీమిండియా మరో మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా కోలీవుడ్‌ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా.. కేరళకు చెందిన మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ కూడా తమిళ సినీ రంగంలో నటుడిగా అడుగుపెట్టాడు. నయనతార, సమంతలతో కలిసి విజయ్‌ సేతుపతి నటించిన కాతువాకుల రెండు కాదల్‌ సినిమాలో శ్రీశాంత్‌ మోబీ అనే పాత్రలో నటించాడు.

చదవండి: వేలంలో రికార్డులు బ‌ద్ద‌లు.. అత్యంత ఖరీదైన ఆట‌గాడిగా సంజూ శాంస‌న్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement