
తనువులు పులకరించాయి. కనులు పరవశించాయి. అణువణువూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆదివారం పాతబస్తీతో పాటు నగరంలో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి, మీరాలం మండీ, చార్మినార్ భాగ్యలక్ష్మి సహా ఇతర ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పించారు.

డప్పుల దరువులు.. శివసత్తుల పూనకాలు.. పోతురాజుల విన్యాసాలు.. అమ్మవార్ల ఫలహార బండ్ల ఊరేగింపులు.. తొట్టెల సమర్పణల మధ్య పాతబస్తీ శోభిల్లింది. అన్ని ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టు వ్రస్తాలను సమర్పించారు.

భక్తులతో దేవాలయాల పరిసరాలు కిటకిటలాడాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు జరగనుంది.
























