
‘‘అధిక బరువు.. ఫిట్‌గా లేడు.. ఇలాగే ఉంటే కెరీర్‌ను ఎక్కువకాలం కొనసాగించలేడు. బరువు తగ్గితే బెటర్..’’.. టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఉద్దేశించి మాజీ క్రికెటర్లు తరచూ చేసే విమర్శలు ఇవి. అయితే, ఇకపై వారికి ఆ అవకాశం లేకుండా చేసేందుకు నడుంకట్టాడు ఈ ముంబైకర్.
కేవలం రెండు నెలల్లోనే సర్ఫరాజ్ ఖాన్ ఏకంగా పదిహేడు కిలోల బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. అంతకు ముందు అలా.. ఇప్పుడు ఇలా అంటూ అతడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. మరి ఇంతకీ సర్ఫరాజ్ ఖాన్ ఇంత త్వరగా బరువు తగ్గడానికి ఎలాంటి డైట్ పాటించాడో తెలుసా?!

రోటీలు, అన్నం తినడం మానేశాము
ఈ విషయం గురించి సర్ఫరాజ్ ఖాన్ తండ్రి, కోచ్ నౌషద్ ఖాన్ మీడియాకు తెలియజేశాడు. ‘‘ ఒక రకంగా నోరు కట్టేసుకున్నామనే చెప్పవచ్చు. దాదాపు నెల, నెలన్నర పాటు రోటీలు, అన్నం తినడం పూర్తిగా మానేశాము.
బ్రకోలి, క్యారట్, దోసకాయ, సలాడ్లు ముఖ్యంగా ఆకుపచ్చటి కూరగాయలతో చేసిన సలాడ్లు ఎక్కువగా తిన్నాము. వీటితో పాటు కాల్చిన చేపలు, కాల్చిన, ఉడకబెట్టిన చికెన్, ఉడకబెట్టిన గుడ్లు డైట్‌లో చేర్చుకున్నాము. గ్రీన్ టీ, గ్రీన్ కాఫీలు తాగాము.
చక్కెర ముట్టనేలేదు
అవకాడోలు, మొలకెత్తిన విత్తనాలు ఎక్కువగా తిన్నాము. అయితే, వీటన్నికంటే ముఖ్యంగా మేము అన్నం, రోటీ తినడం మానేయడం వల్లే ఎక్కువ మేలు జరిగింది. అంతేకాదు చక్కెర కూడా అస్సలు ముట్టలేదు. మైదాతో చేసే పదార్థాలు, బేకరీ ఫుడ్‌ను పూర్తిగా పక్కనపెట్టేశాము.

పన్నెండు కిలోలు తగ్గిపోయాను
ఈ క్రమంలోనే సర్ఫరాజ్ నెలన్నరలోనే దాదాపు పది కిలోలకు పైగా తగ్గిపోయాడు. ఇంకా బరువు తగ్గేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. బిర్యానీ తినడం కూడా పూర్తిగా తగ్గించేశాడు. నేను కూడా దాదాపు పన్నెండు కిలోలు తగ్గిపోయాను.
ఇప్పుడు నా మోకాలి నొప్పికి కాస్త ఉపశమనం కలిగింది. తనతో పాటు డైట్ చేయడం వల్ల నాకు కూడా ఇలా మేలు జరిగింది’’ అని నౌషద్ ఖాన్ హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
గతేడాది అరంగేట్రం
కాగా దేశవాళీ క్రికెట్లో ముంబై తరఫున సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్.. 2024లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటికి ఆరు టెస్టులు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మూడు అర్ధ శతకాలు, ఒక సెంచరీ సాయంతో 371 పరుగులు చేశాడు.
చివరగా ఇటీవల ఇంగ్లండ్-‘ఎ’ జట్టుతో భారత్-‘ఎ’ ఆడిన అనధికారిక టెస్టు సిరీస్‌లో సర్ఫరాజ్ పాల్గొన్నాడు. కాంటర్‌బరీలో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 119 బంతుల్లో 92 పరుగులు చేసి.. సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక నార్తాంప్టన్‌లో జరిగిన రెండో టెస్టులో అతడికి ఆడే అవకాశం రాలేదు.