
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025)లో ఇంగ్లండ్ చాంపియన్స్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. వెస్టిండీస్ చాంపియన్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. పది పరుగుల తేడాతో విండీస్ చేతిలో పరాజయం పాలై.. రెండో ఓటమిని మూటగట్టుకుంది.
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూసీఎల్ టీ20 టోర్నమెంట్లో ఆతిథ్య జట్టు తొలుత పాకిస్తాన్ చాంపియన్స్‌తో తలపడి ఓడిపోయింది. అనంతరం ఆస్ట్రేలియా చాంపియన్స్‌తో పోటీపడాల్సి ఉండగా.. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైపోయింది. తాజాగా తమ మూడో టీ20లో ఇంగ్లండ్ వెస్టిండీస్‌ను ఢీకొట్టింది.
నార్తాంప్టన్ వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ చాడ్విక్ వాల్టన్ మెరుపు అర్ధ శతకం సాధించాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించాడు.
చాడ్విక్‌కు తోడుగా కీరన్ పొలార్డ్ (16 బంతుల్లో 30) కూడా దంచికొట్టాడు. ఇక కెప్టెన్ క్రిస్ గేల్ (19 బంతుల్లో 21) మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. మరోవైపు.. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ మేకర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అజ్మల్ షెహజాద్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిగతా వారిలో సమిత్ పటేల్, ఆర్జే సైడ్‌బాటమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
విండీస్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ చాంపియన్స్ ఆది నుంచే తడ‘బ్యా’టుకు గురైంది. ఓపెనర్లలో సర్ అలిస్టర్ కుక్ డకౌట్ కాగా.. ఇయాన్ బెల్ (5) కూడా నిరాశపరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ మొయిన్ అలీ (0) కూడా చేతులెత్తేయగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (9) కూడా విఫలమయ్యాడు.
ఇలా టాపార్డర్ కుదేలైన వేళ రవి బొపారా (24), సమిత్ పటేల్ (36 బంతుల్లో 52) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ వీరికి మిగతా వారి నుంచి సహకారం లేకపోవడంతో విండీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చాంపియన్స్ తలవంచాల్సి వచ్చింది. ఫిడెల్ ఎడ్‌వర్డ్స్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ జట్టు పతనాన్ని శాసించగా.. షనన్ గాబ్రియెల్, డ్వేన్ బ్రావో రెండేసి వికెట్లు పడగొట్టారు. సులేమాన్ బెన్ కూడా ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ 154 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా వెస్టిండీస్ చాంపియన్స్ పది పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చాంపియన్స్‌ను ఎదుర్కొన్న విండీస్ బాలౌట్‌లో ఓటమిపాలైంది.
Classic Caribbean flair on display 🔥🌴
Chadwick Walton's dazzling 83 off 50 - just the kind of 𝕎𝕚𝕟𝕕𝕚𝕖𝕤 𝕗𝕚𝕣𝕖𝕨𝕠𝕣𝕜𝕤 we love 😍#WCL2025 pic.twitter.com/4OIQC3OIKM— FanCode (@FanCode) July 22, 2025