ఈ టెస్టులో ఆడిస్తే అతడికి అన్యాయం చేసినట్లే: అశ్విన్‌ | If you play Abhimanyu Easwaran it will be injustice to him: R Ashwin | Sakshi
Sakshi News home page

ఈ టెస్టులో ఆడిస్తే అతడికి అన్యాయం చేసినట్లే: అశ్విన్‌

Jul 23 2025 10:55 AM | Updated on Jul 23 2025 12:30 PM

If you play Abhimanyu Easwaran it will be injustice to him: R Ashwin

ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌ టెస్టులో భారత తుదిజట్టు కూర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెటరన్‌ బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌ (Karun Nair)పై వేటు వేయాలని.. అతడి స్థానంలో సాయి సుదర్శన్‌ ఆడించాలని మెజారిటీ మంది మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.

అదే విధంగా.. రిషభ్‌ పంత్‌ (Rishabh Pant)ను కాపాడుకునేందుకు ధ్రువ్‌ జురెల్‌ను వికెట్‌ కీపర్‌గా బరిలోకి దించాలని సూచిస్తున్నారు. ఇక ఆకాశ్‌ దీప్‌ స్థానంలో అన్షుల్‌ కాంబోజ్‌ను అరంగేట్రం చేయించాలని కొంత మంది పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం శార్దూల్‌ ఠాకూర్‌ (Shardul Thakur)ను తిరిగి జట్టులోకి తీసుకోవాలనుకుంటున్నారు.

వికెట్‌ కీపర్‌గానూ పంత్‌
అయితే, నాలుగో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌.. రిషభ్‌ పంత్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు స్పష్టం చేశాడు. అతడే వికెట్‌ కీపింగ్‌ కూడా చేస్తాడని తెలిపాడు. అదే విధంగా.. మూడో పేసర్‌గా అన్షుల్‌తో పాటు ప్రసిద్‌ కృష్ణ కూడా రేసులో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు.

ఈ విశ్లేషణల నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు. కరుణ్‌ నాయర్‌ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను ఆడిస్తారేమోనంటూ సందేహం వ్యక్తం చేశాడు. ఒకవేళ అభిని గనుక ఈ టెస్టులో ఆడిస్తే అతడికి అన్యాయం చేసినట్లే అవుతుందని అశూ అభిప్రాయపడ్డాడు.

ఈ టెస్టులో ఆడిస్తే అతడికి అన్యాయం చేసినట్లే
‘‘ఒకవేళ ఈ టెస్టులో అభిమన్యు ఈశ్వరన్‌ను ఆడిస్తే.. అది అతడికి అన్యాయం చేసినట్లే. ఒకవేళ అతడికి అవకాశం ఇచ్చి బాగానే ఆడాడు అనుకోండి.. అప్పుడు తన ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు సంబంధించిన షాట్లు సోషల్‌ మీడియాలో రీల్స్‌ రూపంలో దర్శనమిస్తాయి.

అభిమన్యు ఈ టెస్టులో ఆడాలనే నేను కోరుకుంటున్నారు. ప్రపంచంలోని అన్ని సంతోషాలు అతడికి దక్కాలి. ఒకవేళ దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో అభి బ్యాట్‌ ఝులిపించలేకపోతే.. అప్పుడు పరిస్థితి ఏంటి?

మూడో స్థానంలో సాయి సుదర్శన్‌ విఫలమయ్యాడు. అతడి స్థానంలో కరుణ్‌ నాయర్‌ను ఆడించారు. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి అభిమన్యును తీసుకుంటారా? ఒకవేళ అలా చేస్తే ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ అక్కడ రాణించగలడా?’’ అని అశ్విన్‌ ప్రశ్నించాడు.

సాయి సుదర్శన్‌ సరైన ఎంపిక
అందుకే ఈసారికి కరుణ్‌ నాయర్‌పై వేటు వేయాలని భావిస్తే.. అతడి స్థానంలో సాయి సుదర్శన్‌ను ఎంపిక చేయాలని అశూ సూచించాడు. అలా కాకుండా.. ఊహించని రీతిలో అభిమన్యును జట్టులోకి తీసుకుంటే.. అతడు రాణించకపోతే.. సాయి లాగే ఒక్క మ్యాచ్‌ తర్వాత మళ్లీ బెంచ్‌కే పరిమితమవుతాడని అభిప్రాయపడ్డాడు.

కాగా టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ సిరీస్‌లో ఆతిథ్య జట్టు 2-1తో ఆధిక్యంలో ఉండగా.. మాంచెస్టర్‌లో బుధవారం నుంచి నాలుగో టెస్టు మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌తో సాయి సుదర్శన్‌ టెస్టుల్లో అరంగేట్రం చేసి.. తొలి ఇన్నింగ్స్‌లోనే డకౌట్‌ అయ్యాడు.

ఇదిలా ఉంటే.. ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి గాయం కారణంగా సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. మరోవైపు.. పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆకాశ్‌ దీప్‌ కూడా గాయపడి నాలుగో టెస్టుకు దూరమయ్యారు.

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత తుదిజట్టు (అంచనా)
శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, సాయి సుదర్శన్, రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజా, కరుణ్‌ నాయర్‌, వాషింగ్టన్‌ సుందర్‌/ శార్దుల్ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ/ అన్షుల్‌ కాంబోజ్‌.

చదవండి: డివిలియర్స్‌ విధ్వంసం.. యువీకి గాయం.. ఇండియా చాంపియన్స్‌కు షాక్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement