
భారత లెజెండ్స్ జట్టు నిర్ణయం
మ్యాచ్‌ను రద్దు చేసిన డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు
బర్మింగ్‌హామ్: ‘వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్’ (డబ్ల్యూసీఎల్) టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను భారత స్టార్లు బహిష్కరించారు. జమ్మూకశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడబోమని శిఖర్ ధావన్ సహా భారత ఆటగాళ్లు వెల్లడించడంతో దాయాదుల పోరును రద్దు చేయక తప్పలేదు. ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తున్న ఈ టోర్నీ రెండో సీజన్ పోటీలు గత నెల 18న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభమయ్యాయి.
వచ్చేనెల 2న జరగనున్న ఫైనల్‌తో టోర్నమెంట్ ముగియనుంది. ఇందులో భారత చాంపియన్స్ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సారథ్యం వహిస్తున్నాడు. జట్టులో హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, వరుణ్ అరోన్ వంటి పలువురు భారత మాజీ ప్లేయర్లు ఉన్నారు. బరి్మంగ్‌హామ్ వేదికగా జరగాల్సిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అయినట్లు డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు.
‘పాకిస్తాన్ హాకీ జట్టు భారత్‌లో ఆడనుందనే వార్తలతో పాటు మరి కొన్ని క్రీడల్లో ఇరు దేశాల మధ్య పోటీలు జరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూసీఎల్‌లో దాయాదుల మ్యాచ్ ద్వారా కొన్ని ఆనంద క్షణాలు పంచుకోవచ్చని అనుకున్నాం. అయితే మా నిర్ణయం చాలా మందికి నచ్చలేదని అర్థమైంది. వారి మనోభావాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో మ్యాచ్‌ను రద్దు చేశాం. ఎవరికైన ఇబ్బంది కలిగించి ఉంటే మన్నించమని కోరుతున్నాం’అని డబ్ల్యూసీఎల్ పేర్కొంది.
పాకిస్తాన్ లెజెండ్స్ జట్టుకు షాహిద్ అఫ్రిది
కెపె్టన్‌గా వ్యవహరిస్తుండగా... షోయబ్ మాలిక్, హఫీజ్, యూనిస్ ఖాన్, తన్వీర్, వహాబ్ రియాజ్, కమ్రాన్ అక్మల్ జట్టులో ఉన్నారు. మరోవైపు ఈ మ్యాచ్ ఆడకూడదని ధావన్ ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించాడు. టోర్నీ ఆరంభం కావడానికి ముందే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడబోనని ధావన్ స్పష్టం చేశాడు. పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు... పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది.
ఎంపీలు యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్‌తో పాటు ఇర్ఫాన్ పఠాన్ కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు సుముఖత వ్యక్తం చేయలేదని డబ్ల్యూసీఎల్ తెలిపింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన గత ఎడిషన్ ఫైనల్లో పాకిస్తాన్ లెజెండ్స్‌పై 5 వికెట్ల తేడాతో నెగ్గిన భారత చాంపియన్స్ జట్టు తొలి టైటిల్ కైవసం చేసుకుంది.