
ఇండియా చాంపియన్స్‌కు తప్పని ఓటమి
ఆస్ట్రేలియా చాంపియన్స్‌తో మ్యాచ్‌లో ఇండియా చాంపియన్స్ (INDCH vs AUSCH) భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టగా.. ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన నేపథ్యంలో.. నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా చాంపియన్స్ నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 203 పరుగులు సాధించింది.
కాగా ప్రపంచ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2025)లో భాగంగా శనివారం నాటి మ్యాచ్‌లో ఇండియా- ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఇంగ్లండ్‌లోని లీడ్స్‌లో గల హెడింగ్లీ మైదానంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ధావన్ సెంచరీ మిస్
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా చాంపియన్స్‌కు ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (Robin Uthappa), శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. ఊతప్ప 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేయగా.. ధావన్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న గబ్బర్ 12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 91 పరుగులు చేశాడు.
The 𝕆𝔾 duo roll back the good 'ol days 🔥
Team 🇮🇳 race to 62/2 in six overs all thanks to a flurry of boundaries 🤩
Are we in for a 200+ total? Find the answers right away, LIVE on FanCode 😎#WCL2025 pic.twitter.com/PGO86izRKQ— FanCode (@FanCode) July 26, 2025
ఆఖరి వరకు అజేయంగా ఉన్న ధావన్.. దురదృష్టవశాత్తూ.. సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ అంబటి రాయుడు డకౌట్ కాగా.. సురేశ్ రైనా (11) కూడా నిరాశపరిచాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్ (3) కూడా విఫలం కాగా.. యూసఫ్ పఠాన్ తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు.
పఠాన్ ఫటాఫట్
కేవలం 23 బంతుల్లోనే 52 పరుగులతో పఠాన్ దుమ్ములేపాడు. ధావన్‌తో కలిసి ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.
ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో డానియల్ క్రిస్టియన్ ఊతప్ప, అంబటి రాయుడు రూపంలో రెండు వికెట్లు తీయగా.. కెప్టెన్ బ్రెట్ లీ రైనా వికెట్ దక్కించుకున్నాడు. ఇక డీ ఆర్సీ షార్ట్ యువరాజ్ సింగ్ రూపంలో కీలక వికెట్ తనఖాతాలో వేసుకున్నాడు.
లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్ చాంపియన్స్
ఇండియా చాంపియన్స్ విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా చాంపియన్స్.. మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్లు షాన్ మార్ష్ (11), క్రిస్ లిన్ (25).. వన్‌డౌన్‌లో వచ్చిన డీ ఆర్సీ షార్ట్ (20) నిరాశపరిచినా.. లోయర్ ఆర్డర్ అద్భుతంగా ఆడింది.
డానియెల్ క్రిస్టియన్ 28 బంతుల్లో 39 పరుగులు సాధించగా.. కల్లమ్ ఫెర్గూసన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 38 బంతుల్లోనే ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 70 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. బెన్ కటింగ్ వేగంగా (6 బంతుల్లో 15) ఆడగా.. రాబ్ క్వినీ (8 బంతుల్లో 16 నాటౌట్) కూడా ఆకట్టుకున్నాడు.
ఫలితంగా 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి ఆసీస్ 207 పరుగులు చేసింది. దీంతో ఇండియా చాంపియన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారత బౌలర్లలో పీయూశ్ చావ్లా మూడు వికెట్లు తీయగా.. హర్భజన్ సింగ్ రెండు, వినయ్ కుమార్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
యువీ సేనకు భంగపాటు
కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజాలతో ఇంగ్లండ్ డబ్ల్యూసీఎల్ టీ20 టోర్నమెంట్ గతేడాది మొదలైంది. అరంగేట్ర సీజన్‌లో ఫైనల్ చేరిన యువీ సేన.. టైటిల్ పోరులో దాయాది పాకిస్తాన్‌ను చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది. ఇక 2025 సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇండియా చాంపియన్స్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.
ఇరుదేశాల మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్‌తో జరగాల్సిన తొలి మ్యాచ్ రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చాంపియన్స్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చాంపియన్స్ చేతిలోనూ ఓడిపోయింది.
కాగా ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ పాల్గొంటున్న ఈ టీ20 టోర్నీ తాజా సీజన్‌లో.. సౌతాఫ్రికా చాంపియన్స్ ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది.
తద్వారా ఆరు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఇండియా చాంపియన్స్ ఇంకా ఖాతా తెరవలేదు. పాక్‌తో మ్యాచ్ రద్దైన నేపథ్యంలో ఒక పాయింట్ రాగా.. పట్టికలో అట్టడుగున ఆరో స్థానంలో ఉంది.
చదవండి: వైభవ్ సూర్యవంశీ మిస్సయ్యాడు! సౌతాఫ్రికా స్టార్ ప్రపంచ రికార్డు