
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా డకౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్ మొదలుపెట్టిన పేసర్ క్రిస్ వోక్స్ (Chris Woakes)అద్భుతమైన డెలివరీలతో వీరిద్దరిని పెవిలియన్‌కు పంపాడు.
మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు డౌన్
తొలి ఓవర్లో నాలుగో బంతికి వోక్స్ సంధించిన బంతిని జైసూ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి గాల్లోకి లేవగా.. ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జో రూట్ (Joe Root) చేతుల్లోకి వెళ్లింది. అయితే, క్యాచ్ పట్టడంలో తడబడిన రూట్.. ఎట్టకేలకు బంతిని జాగ్రత్తగా ఒడిసిపట్టాడు. దీంతో.. నాలుగు బంతులు ఎదుర్కొన్న జైస్వాల్... పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.
ఇక జైసూ స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్‌ను మరుసటి బంతికే వోక్స్ పెవిలియన్‌కు పంపాడు. వోక్స్ వేసిన బంతిని వదిలేయాలని సాయి భావించగా.. బాల్ అతడు ఊహించిన దానికంటే కాస్త ఎక్కువగానే జంప్ అయింది. ఈ క్రమంలో బ్యాట్ బాటమ్ ఎడ్జ్‌ను తాకిన బంతి.. సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్ చేతుల్లో పడింది. దీంతో భారత్ తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్
ఇక అంతకముందు 669 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లండ్.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్ ముగిసేసరికి 311 పరుగుల ఆధిక్యంలో కొనసాగడంతో పాటు.. రెండు వికెట్లు తీసి సత్తా చాటింది.
వరుస బంతుల్లో వికెట్లు తీసిన వోక్స్... కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. దీంతో అతడు హ్యాట్రిక్ మిస్సవగా.. టీమిండియా ఊపిరి పీల్చుకుంది.
ఈ క్రమంలో రెండో ఓవర్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సింగిల్, గిల్‌తో కలిసి సింగిల్ తీయడంతో ఎట్టకేలకు భారత్ పరుగుల ఖాతా తెరిచింది. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భోజన విరామ సమయానికి మూడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి కష్టాల్లో కూరుకుపోయింది.
మరోవైపు.. ఇంగ్లండ్‌కు 310 పరుగుల భారీ ఆధిక్యం ఉంది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు టెస్టులు ఆడుతోంది.
గంభీర్‌పై ఫ్యాన్స్ ఫైర్
ఇందులో ఇప్పటికి మూడు పూర్తి కాగా ఆతిథ్య జట్టు రెండు గెలిచి గిల్ సేనపై 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇక మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులోనూ టీమిండియా పట్టు కోల్పోయింది.
ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై టీమిండియా అభిమానులు ఫైర్ అవుతున్నారు. వన్డే, టీ20ల సంగతి ఎలా ఉన్నా టెస్టు జట్టు కోచ్‌గా పనికిరాడంటూ ట్రోల్ చేస్తున్నారు.
కాగా గంభీర్ ప్రధాన కోచ్‌గా వచ్చిన తర్వాత స్వదేశంలో టెస్టుల్లో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన భారత జట్టు.. పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోయింది. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో వైఫల్యాన్ని కొనసాగిస్తోంది.
చదవండి: వైభవ్ సూర్యవంశీ మిస్సయ్యాడు! సౌతాఫ్రికా స్టార్ ప్రపంచ రికార్డు