వైభవ్‌ సూర్యవంశీ మిస్సయ్యాడు! సౌతాఫ్రికా స్టార్‌ ప్రపంచ రికార్డు | South Africa U19 Batter World Record Which Vaibhav Suryavanshi Misses Out | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సూర్యవంశీ మిస్సయ్యాడు! సౌతాఫ్రికా స్టార్‌ ప్రపంచ రికార్డు

Jul 26 2025 4:04 PM | Updated on Jul 26 2025 4:20 PM

South Africa U19 Batter World Record Which Vaibhav Suryavanshi Misses Out

సౌతాఫ్రికా యువ క్రికెటర్‌ జోరిచ్‌ వాన్‌ షాల్విక్‌ (Jorich Van Schalkwyk) సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూత్‌ వన్డేల్లో డబుల్‌ సెంచరీ (Double Century) సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. జింబాబ్వే అండర్‌-19 జట్టుతో మ్యాచ్‌ సందర్భంగా జోరిచ్‌ ఈ ఘనత సాధించాడు.

విధ్వంసకర ఇన్నింగ్స్‌
మూడు మ్యాచ్‌ల యూత్‌ వన్డే సిరీస్‌ ఆడేందుకు సౌతాఫ్రికా అండర్‌-19 జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో మొదటి వన్డేలో జోరిచ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ టీ20 మాదిరి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు.

కేవలం 153 బంతుల్లోనే 215 పరుగులు సాధించాడు జోరిచ్‌. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 19 ఫోర్లతో పాటు 6 సిక్సర్లు ఉన్నాయి. జోరిచ్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ కారణంగా సౌతాఫ్రికా 385 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.  అయితే, లక్ష్య ఛేదనలో జింబాబ్వే 107 పరుగులకే ఆలౌట్‌ అయింది. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలగా.. 278 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది.

యూత్‌ వన్డేల్లో తొలి ద్విశతకం
ఈ మ్యాచ్‌ సందర్భంగా యూత్‌ వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా జోరిచ్‌ రికార్డు సాధించాడు. గతంలోనూ  అతడు 200 పరుగుల మార్కుకు దగ్గరగా వచ్చి మిస్సయ్యాడు. బంగ్లాదేశ్‌ అండర్‌-19 జట్టుతో జరిగిన యూత్‌ వన్డేలో జోరిచ్‌ 156 బంతుల్లో 164 పరుగులు సాధించాడు.

నాటి మ్యాచ్‌లో బంగ్లా విధించిన లక్ష్యాన్ని సౌతాఫ్రికా 44.4 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టపోయి ఛేదించింది. అలా ఆరోజు బంగ్లాపై విజయంలో కీలక పాత్ర పోషించిన జోరిచ్‌ వాన్‌ షాల్విక్‌.. తాజాగా జింబాబ్వేతో రికార్డు డబుల్‌ శతకంతో మెరిశాడు.

వైభవ్‌ సూర్యవంశీ మిస్సయ్యాడు
ఇదిలా ఉంటే.. భారత్‌ అండర్‌-19 జట్టు ఇటీవల ఇంగ్లండ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాలుగో యూత్‌ వన్డేలో చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ కేవలం 52 బంతుల్లోనే శతకం సాధించి.. ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 78 బంతుల్లో 143 పరుగులు సాధించాడు. 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఈ మేర భారీ శతకం నమోదు చేశాడు. అయితే, దీనిని డబుల్‌ సెంచరీగా మలచలేకపోయాడు.

అలా వైభవ్‌ మిస్సయిన ప్రపంచ రికార్డును జోరిచ్‌ తాజాగా తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా భారత్‌ తరఫున యూత్‌ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా అంబటి రాయుడు కొనసాగుతున్నాడు.

ఇంగ్లండ్‌తో 2002 నాటి మ్యాచ్‌లో రాయుడు 177 పరుగులు సాధించాడు. అతడి తర్వాతి స్థానాల్లో రాజ్‌ అంగద్‌ బవా (2022లో ఉగాండాపై 162), మయాంక్‌ అగర్వాల్‌ (160), శుబ్‌మన్‌ గిల్‌ (160), వైభవ్‌ సూర్యవంశీ (143) ఉన్నారు.

చదవండి: ‘పది కుట్లు పడ్డాయి.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్‌ లేదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement