
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అర్ధ శతకం (52)తో మెరిశాడు. మాంచెస్టర్‌లో శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 77 బంతుల్లో యాభై పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా టెస్టుల్లో గిల్‌కు ఇది ఎనిమిదో హాఫ్ సెంచరీ.
కాగా లీడ్స్‌లో శతక్కొట్టిన గిల్.. ఎడ్జ్‌బాస్టన్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ బాదిన విషయం తెలిసిందే. అయితే, ప్రఖ్యాత లార్డ్స్' మైదానంలో జరిగిన మూడో టెస్టులో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగులే చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులకే పరిమితమయ్యాడు.
ఇక మాంచెస్టర్ టెస్టులోనూ మొదటి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సాబ్ 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, తాజాగా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 52 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ 30 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 29 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే ఇంకా 225 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందు ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగారు.
ఇంగ్లండ్ 669
కాగా మాంచెస్టర్ వేదికగా బుధవారం మొదలైన నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46)లతో పాటు సాయి సుదర్శన్ (61), రిషభ్ పంత్ (54), శార్దూల్ ఠాకూర్ (41) రాణించారు.
అయితే, భారత బౌలర్ల వైఫల్యం కారణంగా ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (84), బెన్ డకెట్ (94)లతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (71) అద్భుత అర్థ శతకం సాధించాడు. జో రూట్ (150), కెప్టెన్ బెన్ స్టోక్స్ (141) భారీ సెంచరీలతో మెరిశారు.
ఫలితంగా ఏకంగా 669 పరుగులు సాధించిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. అన్షుల్ కంబోజ్, మహ్మద్ సిరాజ్‌లు చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.