గంభీర్ ఆలోచించుకో.. మూడో స్థానానికి అతడు స‌రిపోడు: గంగూలీ | Ganguly Advises India: Specialist Top Order Needed for Guwahati Test vs South Africa | Sakshi
Sakshi News home page

గంభీర్ ఆలోచించుకో.. మూడో స్ధానానికి అతడు స‌రిపోడు: గంగూలీ

Nov 19 2025 10:53 AM | Updated on Nov 19 2025 11:18 AM

Washington Sundar not a No.3 batter, India need to rethink his spot: Ganguly

గౌహ‌తిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం వేదిక‌గా భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య రెండో టెస్టు శ‌నివారం(న‌వంబ‌ర్ 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను స‌మం చేయాల‌ని టీమిండియా వ్యూహాలు రచిస్తోంది. తొలి టెస్టులో చేసిన త‌ప్పిదాల‌ను గౌహ‌తిలో పునరావృతం చేయకూడదని భారత్ పట్టుదలతో ఉంది.

ఈ నేపథ్యంలో టీమ్ మేనెజ్‌మెంట్‌కు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక సూచనలు చేశాడు. నంబర్ 3 స్ధానానికి వాషింగ్ట‌న్ సుంద‌ర్ స‌రిపోడని, టాప్ 5లో క‌చ్చితంగా స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉండాల‌ని దాదా అభిప్రాయ‌ప‌డ్డాడు. కాగా కోల్‌క‌తా టెస్టులో మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన సుంద‌ర్ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. 

రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి 60 ప‌రుగులు చేశాడు. వాస్త‌వానికి ఆ స్ధానం సాయి సుద‌ర్శ‌న్‌ది. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో నిరాశ‌ప‌రిచిన సుద‌ర్శ‌న్ స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో మాత్రం స‌త్తాచాటాడు.

అయిన‌ప్ప‌టికి స‌ఫారీల‌తో తొలి టెస్టుకు సుద‌ర్శ‌న్‌ను టీమ్ మేనెజ్‌మెంట్ ప‌క్క‌న పెట్టింది. దీంతో హెడ్ కోచ్ గంభీర్‌పై చాలా మంది మాజీలు విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాకుండా తొలి టెస్టులో న‌లుగురు స్పిన్న‌ర్ల‌తో భార‌త్ బ‌రిలోకి దిగింది.

"వాషింగ్ట‌న్ సుంద‌ర్ అద్భుత‌మైన క్రికెటర్‌. అత‌డికి మంచి ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. కానీ టెస్టు క్రికెట్‌లో మూడో నంబ‌ర్ స్ధానానికి అత‌డు స‌రిపోడు. గ‌తంలో చాలా మంది దిగ్గ‌జాలు ఆ స్ధానంలో బ్యాటింగ్ చేశారు. దీర్ఘ కాల ప్ర‌ణాళిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. టాప్‌-5లో కచ్చితంగా స్పెషలిస్టు బ్యాటర్లు ఉండాలి. 

సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ వంటి ‍కఠిన పరిస్ధితుల్లో కూడా బ్యాటింగ్ చేస్తే సత్తా ఉన్న ఆటగాళ్లకి టాప్-5లో చోటు ఇవ్వాలి. గౌతమ్ గంభీర్‌ దీనిని దృష్టిలో ఉంచుకోవాలి. భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు అవసరం లేదు. తొలి టెస్టులో వాషి కేవలం​ ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. పిచ్‌పై టర్న్ వున్నప్పటికి ప్రధాన స్పిన్నర్లు ముగ్గురు జట్టులో ఉంటే సరిపోతుంది" అని ఇండియా టూడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ పేర్కొన్నాడు.
చదవండి: 'ద్రవిడ్‌నే ట్రోల్ చేశారు.. ఇప్పుడు గంభీర్ ఒక లెక్కా'
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement