కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరిగిన తొలి టెస్టు ఫలితం అందరని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది.
ఇరు జట్లు కూడా ఒక్కసారి కూడా 200 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయాయి. ఈ మ్యాచ్ తొలి రోజు నుంచి బౌలర్లే ఆధిపత్యం చెలాయించారు. దీంతో పిచ్‌పై తీవ్రస్ధాయిలో విమర్శలు వచ్చాయి. ఇటువంటి పిచ్‌లు టెస్టు క్రికెట్ నాశనం చేస్తున్నాయి అని మాజీలు మండిపడ్డారు. అయితే ఈడెన్ పిచ్‌ను భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సమర్ధించడం కొత్త వివాదానికి దారితీసింది.
పిచ్‌లో భూతాలు లేవని, బ్యాటర్లు తప్పిదం వల్లే ఓడిపోయామని గంభీర్ చెప్పుకొచ్చాడు. గంభీర్ వ్యాఖ్యలను అనిల్ కుంబ్లే, డెల్ స్టెయిన్ వంటి దిగ్గజాలు తప్పుబట్టారు. అస్సులు ఇటువంటి పిచ్‌ను తాము చూడలేదని వారు ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప మాత్రం గంభీర్‌కు మద్దతుగా నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్‌లో ఓటమికి గంభీర్‌ను బాధ్యుడిని చేయకూడదని ఊతప్ప అభిప్రాయపడ్డాడు.
"నేను గంభీర్‌ను డిఫెండ్ చేస్తున్నానని విమర్శిస్తున్నారు. కానీ మ్యాచ్ ఫలితాన్ని కోచ్‌తో ముడిపెట్టడం సరికాదు. ఎందుకంటే మైదానంలో కోచ్ వెళ్లి ఆడలేడు కాదా. గెలుపు ఓటములు సహజం. గతంలో రాహుల్ ద్రవిడ్‌ను కూడా ఈ విధంగానే విమర్శించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో దాదాపు 25 వేల పరుగులు చేసిన ద్రవిడ్‌ను ట్రోల్ చేసినప్పుడు.. గంభీర్ వారికి ఒక లెక్క కాదు.
గతంలో దేశవాళీ టోర్నీలో పేలవమైన పిచ్‌లను తయారు తయారుచేసినందుకు క్యూరేటర్లను బీసీసీఐ మందలించింది. కానీ అంతర్జాతీయ మ్యాచ్‌ల విషయంలో మాత్రం అలా జరగడం లేదు. టర్నింగ్ ట్రాక్‌లను సిద్దం చేయమని ఎవరూ ప్రోత్సహించరు. కానీ సహజంగా మూడో రోజు, నాలుగో రోజులలో ఎక్కువ టర్న్ ఉండే పిచ్‌లు ఉపఖండంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్పిన్ బాగా ఆడే ప్లేయర్లు తాయారు చేయాల్సిన బాధ్యత భారత్‌పై ఉంది. గత కొన్నేళ్ల నుంచి మనల్ని స్పిన్ సమస్య వెంటాడుతోంది. ప్రస్తుతం ఆ సమస్యపై టీమ్ మెనెజ్‌మెంట్, సెలక్టర్లు దృష్టిసారించాలని ఊతప్ప పేర్కొన్నాడు.
చదవండి: PAK vs ZIM: పసికూనపై ప్రతాపం.. బోణీ కొట్టిన పాకిస్తాన్


