నీకసలు ఏమైంది?.. బలహీనత మరోసారి బయటపడింది! | Walking wicket for bowlers: Fans slam Gill he gets out cheaply for 2nd time | Sakshi
Sakshi News home page

నీకసలు ఏమైంది?.. బలహీనత మరోసారి బయటపడింది!

Aug 18 2026 1:37 PM | Updated on Aug 18 2026 1:42 PM

Walking wicket for bowlers: Fans slam Gill he gets out cheaply for 2nd time

PC: BCCI X

శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 16 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచాడు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా గిల్‌ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గాలె వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం తొలి టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. మొదటి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఆ ముగ్గురూ రాణించారు
ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (82), ఆరో నంబర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ (51) అర్ధ శతకాలతో రాణించగా.. వన్‌డౌన్లో వచ్చిన దేవదత్‌ పడిక్కల్‌ భారీ సెంచరీ (167)తో ఆకట్టుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో గిల్‌.. 28 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో కేవలం 16 పరుగులు చేశాడు.

రెండుసార్లూ అతడి చేతిలోనే అవుట్‌
లంక స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య బౌలింగ్‌లో లాహిరు ఉదారకు క్యాచ్‌ ఇచ్చి గిల్‌ పెవిలియన్‌ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఈ నాలుగో నంబర్‌ బ్యాటర్‌.. 20 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేయగలిగాడు. ఈసారి కూడా ప్రభాత్‌ జయసూర్య బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. వికెట్ల ముందు దొరికిపోయి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

ఇలా అయితే కష్టమే
ఈ నేపథ్యంలో గిల్‌ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. స్పిన్‌ బౌలింగ్‌లోనే రెండుసార్లు అతడు విఫలమయ్యాడని.. గిల్‌ బలహీనత మరోసారి బయటపడిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా గిల్‌ స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టకపోతే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాగా గిల్‌ చివరగా జూన్‌లో స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో సెంచరీ (126) బాదాడు.  

ఇదిలా ఉంటే.. శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్‌ కాగా.. టీమిండియాకు మంచి ఆధిక్యం లభించింది. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌.. నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement