కోహ్లితో కళకళ... ఓ బుడ్డోడి ఆసక్తికర ప్రశ్న! | Virat Kohli To Play Ranji Match After 2012, Conversation With Young Fan Goes Viral | Sakshi
Sakshi News home page

కోహ్లితో కళకళ... ఓ బుడ్డోడి ఆసక్తికర ప్రశ్న!

Jan 29 2025 4:25 AM | Updated on Jan 29 2025 10:58 AM

Virat Kohli to play Ranji match after 2012

ప్రాక్టీస్‌లో ఢిల్లీ సహచరులతో శ్రమించిన భారత స్టార్‌ 

2012 తర్వాత రంజీ మ్యాచ్‌ ఆడనున్న భారత మాజీ కెప్టెన్‌

రేపటి నుంచి రైల్వేస్‌తో ఢిల్లీ పోరు  

న్యూఢిల్లీ: భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి 2012 తర్వాత దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ బరిలోకి దిగనున్నాడు. ఇటీవలి కాలంలో ఫామ్‌లేమితో పాటు షాట్‌ సెలెక్షన్‌ విషయంలో పదే పదే పొరబాట్లు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లి... ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు రంజీ మ్యాచ్‌ ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి రైల్వేస్‌తో ప్రారంభం కానున్న రంజీ మ్యాచ్‌లో కోహ్లి ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. 

చివరిసారిగా 2012లో ఉత్తరాఖండ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఆడిన కోహ్లి... ఆ తర్వాత అంతర్జాతీయ షెడ్యూల్‌ కారణంగా దేశవాళీ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే దేశవాళీల్లో ఆడాల్సిందే అని ఇటీవల భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లేయర్లను హెచ్చరించడంతో స్టార్‌ ఆటగాళ్లు కూడా రంజీ బాటపట్టారు. 

టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, శ్రేయస్‌ అయ్యర్‌ ఆరో రౌండ్‌ రంజీ మ్యాచ్‌ల్లో ఆడగా... రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌ల్లో కోహ్లితో పాటు కర్ణాటక తరఫున కేఎల్‌ రాహుల్, హైదరాబాద్‌ తరఫున మొహమ్మద్‌ సిరాజ్‌ కూడా ఆడుతున్నారు. మంగళవారం ఢిల్లీ జట్టుతో కలిసి కోహ్లి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. ఆద్యంతం ఉత్సాహంగా కనిపించిన కోహ్లి ... కోచ్‌లతో చర్చిస్తూ కుర్రాళ్లలో ఉత్సాహం నింపుతూ సందడి చేశాడు.  

కోహ్లి... ‘కడీ చావల్‌’ 
కెరీర్‌ ఆరంభంలో ఢిల్లీ జట్టు తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన విరాట్‌... తిరిగి 13 ఏళ్ల తర్వాత ఆ డ్రెస్సింగ్‌రూమ్‌లో అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఉన్న నవ్‌దీప్‌ సైనీ మినహా మిగిలిన 17 మంది ప్లేయర్లు కేవలం టీవీల్లో మాత్రమే చూసిన స్టార్‌ ఆటగాడితో కలిసి ప్రాక్టీస్‌ చేశారు. ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో ‘చీకూ’గా మొదలైన విరాట్‌ కోహ్లి ప్రస్థానం... దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ‘కింగ్‌’ వరకు చేరింది. 

ఢిల్లీ హెడ్‌ కోచ్‌ శరణ్‌దీప్‌ సింగ్, బ్యాటింగ్‌ కోచ్‌ బంటూ సింగ్‌ పర్యవేక్షణలో విరాట్‌ ప్రాక్టీస్‌ సాగించాడు. భారత అండర్‌–19 జట్టుకు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో కోచ్‌గా పనిచేసి, ప్రస్తుత జట్టుకు మేనేజర్‌గా పనిచేస్తున్న మహేశ్‌ భాటీ విరాట్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ‘అతడేం మారలేదు. అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. 

విరాట్‌కు ‘ఛోళే పూరీ’ బాగా ఇష్టమని అతడి కోసం అవి తెప్పించాం. కానీ ఇప్పుడు తినడంలేదని విరాట్‌ చెప్పాడు’ అని మహేశ్‌ పేర్కొన్నాడు. ప్రాక్టీస్‌ అనంతరం ప్లేయర్లతో కలిసి ‘కడీ చావల్‌’ (పప్పన్నం) తిన్నాడని వెల్లడించాడు. మొదట ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించకపోయినా... విరాట్‌ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని జియో సినిమా లైవ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది.
  
కుర్రాళ్లతో కలిసి... 
ఉదయం తొమ్మిది గంటలకు ఖరీదైన పోర్షే కారులో మైదానానికి చేరుకున్న విరాట్‌... ఒక్కసారి ప్రాక్టీస్‌ ప్రారంభించాక నిత్యవిద్యార్థిలా శ్రమించాడు. తొలుత 35 నిమిషాల పాటు ప్లేయర్లతో కలిసి వార్మప్‌ చేసిన కోహ్లి... ఆ తర్వాత 15 నిమిషాల పాటు ఫుట్‌బాల్‌ ఆడాడు. ఆ తర్వాత నెట్‌ సెషన్‌ ప్రారంభమైంది. ఆ సమయంలో ఢిల్లీ రంజీ జట్టు కెప్టెన్‌ ఆయుశ్‌ బదోనీ వద్దకు వెళ్లిన కోహ్లి... ‘ఆయుశ్‌ నువ్వు ముందు బ్యాటింగ్‌ చేయి. ఆ తర్వాత మనిద్దరం స్థానాలు మార్చుకుందాం’ అని చెప్పాడు. 

స్టార్‌ ఆటగాళ్లు రంజీల్లో ఆడనున్న నేపథ్యంలో ఢిల్లీ క్రికెట్‌ బోర్డు రిషబ్‌ పంత్‌తో పాటు విరాట్‌ కోహ్లికి కెపె్టన్సీ చేపట్టాలని కోరగా... ఈ ఇద్దరూ దాన్ని సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఐపీఎల్‌ మెరుపులతో వెలుగులోకి వచ్చిన ఆయుశ్‌ బదోనీ ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. నెట్స్‌లో గంటకు పైగా ప్రాక్టీస్‌ చేసిన విరాట్‌... త్రోడౌన్స్‌ వేయించుకొని పుల్‌ షాట్లు సాధన చేశాడు. 

పేసర్లు నవ్‌దీప్‌ సైనీ, రాహుల్‌ గెహ్లాట్, సిద్ధాంత్‌ శర్మ, మోనీ గ్రెవాల్, స్పిన్నర్లు హర్‌‡్ష త్యాగి, సుమిత్‌ మాథుర్‌ను సునాయాసంగా ఎదుర్కొన్న కోహ్లి బ్యాక్‌ఫుట్‌పై ఎక్కువ షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. అలాగే ఆఫ్‌ వికెట్‌ లైన్‌ బంతులను ఎక్కువగా వదిలేశాడు.  

కోహ్లికి కబీర్‌ ఆసక్తికర ప్రశ్న! 
మంగళవారం విరాట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో గ్రౌండ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కోహ్లి సాధన ముగించుకొని వెళ్తున్న సమయంలో నాలుగో తరగతి చదువుతున్న ఓ కుర్రాడు... ‘విరాట్‌ అంకుల్‌’ అంటూ పిలవడంతో అటు వైపు వెళ్లిన కోహ్లి అతడితో సుదీర్ఘంగా ముచ్చటించి కీలక సూచనలు చేశాడు. 

ఆ కుర్రాడి పేరు కబీర్‌ కాగా... అతడి తండ్రి ఒకప్పుడు విరాట్‌ కోహ్లీతో కలిసి ఢిల్లీ అండర్‌–17, అండర్‌–19 జట్లకు ఆడిన షావేజ్‌. భారత జట్టుకు ఆడాలంటే ఏం చేయాలని కబీర్‌ ప్రశ్నించగా... ‘కఠోర సాధన చేయాలి. ప్రాక్టీస్‌ ఎప్పుడూ వదిలేయొద్దు. మీ నాన్న నిన్ను ప్రాక్టీస్‌కు వెళ్లు అని చెప్పకూడదు. నువ్వే నాన్నా నేను గ్రౌండ్‌కు వెళ్తున్నా అని చెప్పాలి’ అని కోహ్లి సూచించాడు. 

Advertisement
 
Advertisement
Advertisement