టీమిండియాలో విరాట్‌ కోహ్లికి ప్రాధాన్యత తగ్గుతోందా..?  | Virat Kohli Has Missed More ODI Games From 2021 To 2023 Than He Did In Entire Preceding Decade | Sakshi
Sakshi News home page

టీమిండియాలో విరాట్‌ కోహ్లికి ప్రాధాన్యత తగ్గుతోందా..? 

Sep 19 2023 3:13 PM | Updated on Sep 19 2023 3:23 PM

Virat Kohli Has Missed More ODI Games From 2021 To 2023 Than He Did In Entire Preceding Decade - Sakshi

స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లికి టీమిండియాలో ప్రాధాన్యత తగ్గుతుందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. గడిచిన రెండు, మూడేళ్లలో రన్‌మెషీన్‌ను భారత సెలెక్టర్లు విశ్రాంతి పేరుతో తరుచూ పక్కకు కూర్చోబెడుతున్నారన్నది జగమెరిగిన సత్యం. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అయితే ఈ ధోరణి మరీ ఎక్కువైపోయింది. కోహ్లి ఓ సిరీస్‌లో కనిపిస్తే, తదుపరి రెండు, మూడు సిరీస్‌లకు రెస్ట్‌ ఇస్తున్నారు.

భీకర ఫామ్‌లో ఉన్నా, యువకులకు అవకాశాల పేరుతో సెలెక్టర్లు ఉద్దేశపూర్వకంగా కోహ్లిని తప్పిస్తున్నారు. ఇటీవలికాలంలో ఇలా జరగడం షరామామూలైపోయింది. ఈ విషయంపై కోహ్లి సైతం నోరు విప్పకపోవడంతో ఎలాంటి వివాదాలు జరగడం లేదు. అయితే కోహ్లి అభిమానుల్లో మాత్రం ఈ బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కోహ్లి బ్యాటింగ్‌ను వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో చూద్దామంటే, ఆ అవకాశం వారికి దొరకడం లేదు.

మరోవైపు వయసు పైబడుతుండటంతో కోహ్లినే స్వయంగా సెలెక్టర్లను అడిగి విశ్రాంతి తీసుకుంటున్నాడన్న వాదనలూ వినిపిస్తున్నాయి. త్వరలో జరుగనున్న ఆసీస్‌ సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు కోహ్లికి విశ్రాంతి కల్పించడంతో ఓ ఆసక్తిర అంశంపై తెరపైకి వచ్చింది. కోహ్లి గడిచిన దశాబ్ద​కాలంలో (2011-2020) భారత్‌ ఆడిన వన్డే మ్యాచ్‌ల్లో కేవలం 20 మ్యాచ్‌లకు మాత్రమే దూరం కాగా.. 2021-2023 మధ్యలో కోహ్లిని రెస్ట్‌ పేరుతో ఏకంగా 21 మ్యాచ్‌లకు పక్కకు కూర్చోబెట్టారు. ఈ గణాంకాలే ప్రస్తుతం కోహ్లి అభిమానులను బాధిస్తున్నాయి.

కోహ్లికి టీమిండియాలో క్రమంగా ప్రాధాన్యత తగ్గిస్తున్నారంటూ వారు వాపోతున్నారు. పదేళ్లకాలంలో కోహ్లి కేవలం 20 వన్డేలను మిస్‌ అయితే, గడిచిన మూడేళ్లలో రెస్ట్‌ పేరుతో కోహ్లిని 21 వన్డే మ్యాచ్‌ల నుంచి తప్పించారని దుయ్యబడుతున్నారు. వాస్తవానికి భారత సెలెక్టర్లు రొటేషన్‌ పద్ధతిని అవలంభిస్తూ అర్హులైన అందరు ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు.

రొటేషన్‌ పద్దతిని పాటించే క్రమంలో కోహ్లితో పాటు రోహిత్‌ శర్మను కూడా పలు మ్యాచ్‌ల నుంచి రెస్ట్‌ పేరుతో తప్పిస్తున్నారు. అయితే కోహ్లితో పోలిస్తే హిట్‌మ్యాన్‌ను పక్కకు పెట్టడం​ కాస్త తక్కువే. ఏదిఏమైనా యువకులకు అవకాశాలు ఇవ్వాలంటే కోహ్లి లాంటి ఆటగాళ్లు తమ స్థానాలను త్యాగం చేయక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇదిలా ఉంటే, ఈ నెల (సెప్టెంబర్‌) 22, 24, 27 తేదీల్లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో  జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు నిన్న (సెప్టెంబర్‌ 18) రెండు వేర్వేరు జట్లను ప్రకటించారు. తొలి రెండు వన్డేలకు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌లకు సెలెక్టర్లు రెస్ట్‌ ఇచ్చారు. దీంతో ఈ మ్యాచ్‌లలో టీమిండియాకు కేఎల్‌ రాహుల్‌ నాయకత్వం వహించనున్నాడు.

రోహిత్‌, కోహ్లి, హార్దిక్‌, కుల్దీప్‌ యాదవ్‌లు తిరిగి మూడో వన్డేకు జట్టులో చేరతారు. అందరూ ఊహించిన విధంగానే సెలెక్టర్లు వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు పిలుపునిచ్చారు. 

ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు భారత జట్టు: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ

ఆసీస్‌తో మూడో వన్డేకు భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్ సిరాజ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement