ఐసీసీ ఇవాళ (జనవరి 14) విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఫ్యాన్స్‌కు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. దిగ్గజ బ్యాటర్లలో ఒకరు టాప్ ర్యాంక్‌కు చేరుకొని సొంత అభిమానుల్లో ఆనందం నింపగా.. అప్పటికే టాప్ ప్లేస్‌లో ఉన్న మరో ఆటగాడు రెండు స్థానాలు కోల్పోయి, పర్సనల్ ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేశాడు. ఇంతకీ ఆ దిగ్గజ బ్యాటర్లు ఎవరంటే..?
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ. విరాట్ తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 93 పరుగులు చేయడంతో ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం మెరుగుపర్చుకొని టాప్ ర్యాంక్‌కు చేరాడు. అప్పటికే టాప్ ప్లేస్‌లో ఉండిన రోహిత్ శర్మ న్యూజిలాండ్‌పై కేవలం 26 పరుగులకే పరిమితం కావడంతో రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు.
అదే మ్యాచ్‌లో 84 పరుగులతో సత్తా చాటిన న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ ఓ స్థానం మెరుగపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు. అదే మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ (29 నాటౌట్) ఆడిన కేఎల్ రాహుల్ ఓ స్థానం మెరుగుపర్చుకొని, 11వ స్థానానికి చేరాడు. టాప్-10లో భారత్ తరఫున మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఉన్నారు. శుభ్‌మన్ గిల్ 5, శ్రేయస్ అయ్యర్ 10 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇవి మినహా ఈ వారం ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు.
బౌలర్ల విషయానికొస్తే.. టాప్-10లో ఒక్క మార్పు కూడా లేదు. రషీద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్, కుల్దీప్ యాదవ్ టాప్-3గా కొనసాగుతున్నారు. భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఈ వారం ర్యాంకింగ్స్‌లో గణనీయంగా లబ్ది పొందాడు. న్యూజిలాండ్‌పై తొలి వన్డేలో 2 వికెట్లు తీయడంతో ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 16వ స్థానానికి చేరాడు. అదే మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన మరో టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా ఐదు స్థానాలు కోల్పోయి 21వ ప్లేస్‌కు పడిపోయాడు.
ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఒమర్‌జాయ్, సికందర్, మొహమ్మద్ నబీ టాప్-3లో కొనసాగుతుండగా.. భారత్ తరఫున అక్షర్ పటేల్ పదో స్థానంలో నిలిచాడు.


