తమ్ముడిని విమర్శించిన మాజీ క్రికెటర్‌.. అన్న కౌంటర్‌ అదుర్స్‌ | Virat Kohli Brother Issues Fiery Reply To Sanjay Manjrekar Slams With Strike Rate | Sakshi
Sakshi News home page

Virat Kohli: తమ్ముడిని విమర్శించిన మాజీ క్రికెటర్‌.. విరాట్‌ అన్న కౌంటర్‌ అదుర్స్‌

Apr 30 2025 12:36 PM | Updated on Apr 30 2025 12:59 PM

Virat Kohli Brother Issues Fiery Reply To Sanjay Manjrekar Slams With Strike Rate

టీమిండియా రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి (Virat Kohli) ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లోనూ మేటి ఆటగాడిగా ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. లీగ్‌ ఆరంభం నుంచి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)కి ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లి.. కెప్టెన్‌గానూ ‍వ్యవహరించాడు. ఇప్పటి వరకు మొత్తంగా 262 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 8447 పరుగులు సాధించాడు.

తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కింగ్‌ కొనసాగుతున్నాడు. ఇక కోహ్లి ఖాతాలో ఎనిమిది ఐపీఎల్‌ సెంచరీలు కూడా ఉండటం విశేషం. 

గతేడాది 15 మ్యాచ్‌లలో కలిపి 741 పరుగులు చేసిన కోహ్లి.. ఆరెంజ్‌ క్యాప్‌ గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటికి పది మ్యాచ్‌లలో కలిపి 443 పరుగులు చేసి.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

స్ట్రైక్‌రేటుపై  విమర్శలు
అయితే, ఇన్ని ఘనతలు సాధించినప్పటికీ కోహ్లి స్ట్రైక్‌రేటుపై సునిల్‌ గావస్కర్‌, సంజయ్‌ మంజ్రేకర్‌ వంటి భారత మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తూనే ఉన్నారు. ఇటీవల ముంబై ఇండియన్స్‌తో ఆర్సీబీ మ్యాచ్‌ సందర్భంగా మంజ్రేకర్‌ కోహ్లిపై విమర్శలు గుప్పించాడు.

బుమ్రా వర్సెస్‌ కోహ్లి ఇకపై బెస్ట్‌ వర్సెస్‌ బెస్ట్‌ కాదని పేర్కొన్నాడు. ఐపీఎల్‌-2025లో అగ్రస్థానంలో ఉండే పదిమందిలో తానైతే కోహ్లి పేరు చెప్పనని.. అతడు తన జాబితాలో లేడనే మంజ్రేకర్‌ వ్యాఖ్యానించాడు.

మాట్లాడటం సులువే
ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి అన్నయ్య వికాస్‌ కోహ్లి సంజయ్‌ మంజ్రేకర్‌కు ‘ఎక్స్‌’ వేదికగా కౌంటర్‌ ఇచ్చాడు. ‘‘సంజయ్‌ మంజ్రేకర్‌.. వన్డే కెరీర్‌ స్ట్రైక్‌ రేటు: 64.31.. 200కి పైగా స్ట్రైక్‌రేట్ల గురించి మాట్లాడటం సులువే’’ అంటూ తన తమ్ముడిని విమర్శించినందుకు అతడి స్ట్రైక్‌రేటు గురించి ప్రస్తావిస్తూ చురకలు అంటించాడు.

సింగిల్స్‌, డబుల్స్‌కి కూడా ప్రాధాన్యం
కాగా అంతకుముందు విరాట్‌ కోహ్లి కూడా విమర్శకులకు కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతూ జట్టును విజయపథంలో నడపడమే అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. తాను సింగిల్స్‌, డబుల్స్‌కి కూడా ప్రాధాన్యం ఇస్తానని.. ఒక్కోసారి ఆ పరుగులే ఎంతో కీలకం అవుతాయన్నాడు.

కానీ కొందరు మాత్రం భాగస్వామ్యాల ప్రాధాన్యం గురించి మరిచి.. విమర్శలకు దిగుతుంటారని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్‌లో ఆర్సీబీ దుమ్ములేపుతోంది. రజత్‌ పాటిదార్‌ నాయకత్వంలో ఇప్పటికి ఆడిన పది మ్యాచ్‌లలో ఏడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

చదవండి: అతడిని బ్యాన్‌ చేయండి: టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం

Advertisement
 
Advertisement
Advertisement