పతకం లేకపోతేనేమి.. నువ్వే మా బంగారం! | Vinesh Phogats disqualification from Paris Olympics | Sakshi
Sakshi News home page

#Vinesh Phogat: పతకం లేకపోతేనేమి.. నువ్వే మా బంగారం!

Aug 8 2024 11:30 AM | Updated on Aug 8 2024 11:47 AM

Vinesh Phogats disqualification from Paris Olympics

వినేశ్‌ ఫొగాట్‌ ఫైనల్‌ చేరి ఒలింపిక్‌ పతకం ఖాయం చేసుకున్న సమయాన దేశం మొత్తం పులకించింది. ప్రజలంతా ‘దేశ్‌ కీ బేటీ’ గెలుపును తమ గెలుపుగా భావించారు. ఆమెను ఒక్క క్రీడాకారిణిగానే కాకుండా ఒక పోరాట యోధురాలిగా చూశారు. 

గత ఏడాదిన్నర కాలంగా వినేశ్‌ వ్యవస్థతో పోరాడటం, ఆపై మళ్లీ బరిలోకి దిగి విజయాలు సాధించిన తీరు ఫొగాట్‌పై ఆదరణను పెంచాయి. ఫైనల్‌ చేరినప్పుడు వచ్చిన స్పందన దానినే ప్రతిఫలించింది. ఎవరు గెలిచినా గెలవకపోయినా వినేశ్‌ పతకం గెలిస్తే చాలనుకున్నారు. 

ఇప్పుడు పతకం చేజారడం కూడా అంతే స్థాయిలో ఆవేదనను కలిగించింది. అందుకే అన్ని వైపుల నుంచి బాధతో కూడిన స్పందనలు. ఇదీ వినేశ్‌ సంపాదించుకున్న అభిమాన ధనం! ఒక్కసారి కొంత వెనక్కి వెళ్లి చూస్తే రెజ్లింగ్‌ ప్రపంచంలో ఆమె ఎన్నో పెద్ద విజయాలు అందుకుంది. 

కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు మాత్రమే కాదు వరల్డ్‌ చాంపియన్‌íÙప్‌లలో కూడా ఆమె రెండు పతకాలు గెలుచుకుంది. ఢిల్లీలో నిరసనల సమయంలో ఆమె తెగింపును, రెజ్లింగ్‌ పెద్దలతో తలపడిన ఘటనలను చూస్తే కెరీర్‌ను ముగించడానికే సిద్ధపడినట్లుగా అనిపించింది. 

ఆ సమయంలో మరో ఒలింపిక్‌ ప్రయత్నం అవకాశాలు కూడా కనిపించలేదు. కానీ నాటి ఘటనలు ఆమెలో మరింత పట్టుదలను పెంచాయి. తాను పోరాడుతోంది తన కోసం కాదని, సహచర మహిళా రెజ్లర్ల కోసమని నినదించిన వినేశ్‌ ఆ పోరాటంలో కొంత వరకు సఫలమైంది. 

కానీ అక్కడితే ఆగిపోతే రాజకీయాలు మొదలవుతాయని ఆమెకు అర్థమైంది. అందుకే మళ్లీ ఆటలోకి దిగేందుకు నిశ్చయించుకుంది. కెరీర్‌లో మిగిలిన ఒలింపిక్‌ పతకం కోసం ఆమె ఎంతో శ్రమించింది. వెయిట్‌ కేటగిరీలో మార్చుకొని మరీ ప్రయాణాన్ని కొత్తగా మొదలు పెట్టింది. 

మధ్యలో గాయాలు ఎదురైనా తగ్గలేదు. బుధవారం ఆమె అనుభవించిన వేదనను లెక్క కట్టేందుకు ఎలాంటి పరికరాలు లేవు. 100 గ్రాముల బరువు విలువ ఇంత భారంగా ఉంటుందని ఆమె ఊహించలేదు. ఇక్కడ ఒక మెడల్‌ ఆమె మెడను అలంకరించకపోవచ్చు. 

కానీ ఆమె ఓడిపోలేదు. బంగారం, వెండి పతకాలతో పోలిస్తే ఆమె చూపించిన పోరాటం, పట్టుదల అమూల్యం. బరువు లెక్కలు తప్పడం తప్ప బాధపడేందుకు వినేశ్‌ ఎలాంటి తప్పూ చేయలేదు. ఆమె డోపింగ్‌కు పాల్పడలేదు. ఉద్దేశపూర్వకంగా ఓడలేదు. అయినా మ్యాచ్‌ ఫిక్సర్లను కూడా మళ్లీ పిలిచి ఆడించే మన దేశంలో వినేశ్‌ సాధించిన ఘనతను చూసి సంతోషించాలి. అందరూ గర్వించేలా చేసిన ఈ అమ్మాయే అసలు బంగారం!
- సాక్షి క్రీడా విభాగం  

Advertisement
 
Advertisement
Advertisement