
ఒలింపిక్ పతక విజేత, క్రీడా వైద్యుడిగా గుర్తింపు
టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌కు తండ్రి
భారత క్రీడల్లో ప్రత్యేక ముద్ర
కోల్‌కతా: క్రీడాకారుడు, క్రీడలకు సంబంధించిన వివిధ రంగాల్లో నైపుణ్యం... స్వయంగా ఒలింపిక్ పతకం గెలిచిన జట్టులో సభ్యుడు, మరో ఒలింపిక్ మెడలిస్ట్‌కు తండ్రి... వైద్యుడిగా వేర్వేరు క్రీడాంశాల్లో ప్రత్యేక గుర్తింపు... బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ వీస్ పేస్ బయోడేటా ఇది. 80 ఏళ్ల వీస్ పేస్ గురువారం అనారోగ్య కారణాలతో కోల్‌కతాలో కన్ను మూశారు.
చికిత్స కోసం మంగళవారం ఆయనను ఆస్పత్రిలో చేర్చించగా ఆపై కోలుకోలేకపోయారు. గత కొంత కాలంగా వీస్ పేస్ పార్కిన్సన్ వ్యాధితో కూడా బాధపడుతున్నారు. భారత మహిళల బాస్కెట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ జెన్నిఫర్‌ను వివాహమాడిన వీస్‌కు కుమారుడు లియాండర్‌తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విదేశాల్లో ఉన్న వారిద్దరు తిరిగొచ్చిన తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి.
ప్లేయర్‌గా మొదలై...
1945లో గోవాలో పుట్టిన వీస్ పేస్ మొదటి నుంచి అటు క్రీడల్లోనూ, ఇటు క్రీడా వైద్యంలోనూ చురుగ్గా ఉండేవారు. ఫుట్‌బాల్, క్రికెట్, రగ్బీ వంటి ఆటల తర్వాత ఆయన హాకీని పూర్తి స్థాయిలో ఎంచుకొని సత్తా చాటారు. మిడ్ ఫీల్డర్‌గా భారత హాకీ జట్టు తరఫున రాణించిన వీస్‌కు 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టులో ఆడే అవకాశం త్రుటిలో చేజారింది. అయితే ఆ తర్వాత టీమ్‌లో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు.
1971 హాకీ వరల్డ్ కప్‌లో మూడో స్థానంలో నిలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. తర్వాతి ఏడాదే మరో కీలక విజయంలో ఆయన భాగమయ్యారు. 1972 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులో కూడా వీస్ కీలక పాత్ర పోషించారు. ఆటగాడిగా గుర్తింపు పొందక ముందే 1964–65లో ఆయన కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ప్రి మెడికల్ కోర్సు పూర్తి చేశారు.
స్పోర్ట్స్ డాక్టర్‌గా...
హాకీ నుంచి తప్పుకోగానే వీస్ పేస్ పూర్తి స్థాయిలో క్రీడా వైద్యంపై దృష్టి పెట్టారు. నాటి రోజుల్లో మన దేశంలో స్పోర్ట్స్ మెడిసిన్‌పై పెద్దగా అవగాహన, గుర్తింపు రాని రోజుల్లోనే వీస్ ఆధునిక వైద్య విధానాలతో భిన్న క్రీడాంశాల్లో ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేశారు. దశాబ్దకాలం పాటు భారత డేవిస్ కప్ జట్టుతో పాటు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్‌లో పాల్గొన్న టీమ్‌లకు కూడా ఆయన టీమ్ డాక్టర్‌గా పని చేశారు.

స్పోర్ట్స్ మెడిసిన్ ద్వారా పలువురు భారత ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోవడంలో వీస్ సహకరించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్, బీసీసీఐకి కూడా ఆయన సుదీర్ఘకాలం కన్సల్టెంట్‌గా పని చేశారు. ముఖ్యంగా బీసీసీఐ యాంటీ డోపింగ్ ప్రోగ్రామ్‌లో ఆయన కీలక పాత్ర పోషిస్తూ బోర్డుకు సహకరించారు.
కొడుకును తీర్చిదిద్ది...
తండ్రీ కొడుకులు ఒలింపిక్ పతక విజేతలు కావడం ప్రపంచ క్రీడల్లో చాలా అరుదు. అలాంటి ఘనతను పేస్ కుటుంబం సాధించింది. తండ్రి ప్రోత్సాహంతో క్రీడాకారుడిగా మారిన లియాండర్ తర్వాతి కాలంలో భారత టెన్నిస్ దిగ్గజంగా తన పేరును లిఖించుకున్నాడు. లియాండర్ కెరీర్‌ను తీర్చిదిద్దడంతో తండ్రిగా, మేనేజర్‌గా, మెంటార్‌గా వీస్ పాత్ర చాలా పెద్దది.
18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో పాటు 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన లియాండర్ తండ్రి అంచనాలను అందుకోగలిగాడు. వీస్ పేస్ మృతి పట్ల హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ తిర్కీతో పాటు మాజీ ఆటగాళ్లు అజిత్‌పాల్ సింగ్, వీరెన్ రస్కిన్హా, బీపీ గోవింద, హర్బీందర్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ‘వీస్ అంకుల్‌తో నాకు దాదాపు పాతికేళ్ల అనుబంధం ఉంది.
2002 బుసాన్ ఆసియా క్రీడల నుంచి ఆయన ఎన్నోసార్లు మాతో కలిసి పని చేశారు. స్వయంగా ఆటగాడు కావడంతో ఆయనకు క్రీడాకారుల మానసిక స్థితిపై కూడా సరైన అవగాహన ఉండేది. దాని ప్రకారమే ఆయన వైద్యం చేసేవారు. భారత క్రీడారంగానికి ఆయన లోటు తీరనిది’ అని నివాళి అర్పించింది.