
భారత వన్డే జెర్సీలో వైభవ్
ఇంగ్లండ్ గడ్డపై భారత యువ సంచలనం, అండర్-19 స్టార్ వైభవ్ సూర్యవంశీ హవా కొనసాగుతోంది. బెకన్‌హామ్ వేదికగా ఇంగ్లండ్ అండర్-19తో జరుగుతున్న తొలి యూత్ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన వైభవ్.. బౌలింగ్‌లో మాత్రం సత్తాచాటాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన వైభవ్ రెండు కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హంజా షేక్(84),థామస్ రెవ్(34) వికెట్లను వైభవ్ పడగొట్టాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల వైభవ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గల్ఫ్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. ఓ యూత్ టెస్టు మ్యాచ్‌లో వికెట్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత అండర్-19 క్రికెటర్ మనిషీ పేరిట(15) ఉండేది. తాజా మ్యాచ్‌తో మనిషీ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.
సూపర్ ఫిప్టీ..
రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం వైభవ్ బ్యాట్ ఝూళిపించాడు. 44 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కెప్టెన్ ఆయూశ్ మాత్రే(32) రాణించాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి యువ భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో విహాన్ మల్హోత్రా (34), అభిగ్యాన్ కుందు (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ 229 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చీ వాన్ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా, సెకెండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ