
ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్ట్‌లో భారత యువ జట్టు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు మాత్రమే చేసి ఔటైన వైభవ్.. రెండో ఇన్నింగ్స్‌లో తన సహజ శైలిలో విరుచుకుపడ్డాడు.
ఈ ఇన్నింగ్స్‌లో 44 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన కెప్టెన్ ఆయుశ్ మాత్రే ఈ ఇన్నింగ్స్‌లో 32 పరుగులకే ఔటయ్యాడు.
మరో స్టార్ ప్లేయర్ చవ్డా 3 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. విహాన్ మల్హోత్రా (34), అభిగ్యాన్ కుందు (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ 229 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చీ వాన్ 3 వికెట్లు తీశాడు.
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులకు ఆలౌటైంది. రాకీ ఫ్లింటాఫ్ (93), కెప్టెన్ హమ్జా షేక్ (84) సత్తా చాటారు. లోయర్ మిడిలార్డర్ ఆటగాళ్లు ఎకాంశ్ సింగ్ (59), రాల్ఫీ ఆల్బర్ట్ (50) అర్ద సెంచరీలతో రాణించారు.
జాక్ హోమ్ (44), థామస్ రూ (34), జేడన్ డెన్లీ (27), జేమ్స్ మింటో (20) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో హెనిల్ పటేల్ 3 వికెట్లతో సత్తా చాటగా.. అంబరీష్, వైభవ్ సూర్యవంశీ చెరో 2.. దీపేశ్ దేవేంద్రన్, మొహమ్మద్ ఎనాన్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీశారు.
దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (102) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. విహాన్ మల్హోత్రా (67), అభిగ్యాన్ కుందు (90), రాహుల్ కుమార్ (85), ఆర్‌ఎస్ అంబరీష్ (70) అర్ద సెంచరీలతో రాణించారు.
కుర్ర చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఈ ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. వైభవ్ 13 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు చేసి అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో రాల్ఫీ ఆల్బర్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
మిగతా బ్యాటర్లలో చవ్డా 11, మొహమ్మద్ ఎనాన్ 23, హెనిల్ పటేల్ 38, దీపేశ్ దేవేంద్రన్ 4, అన్మోల్‌జీత్ సింగ్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో గ్రీన్, ఆల్బర్ట్ తలో 3 వికెట్లు తీయగా.. జాక్ హోమ్, ఆర్చీ వాన్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి మ్యాచ్ మినహా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో చెలరేగిపోయాడు.
తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు.
ఐదో వన్డేలో 42 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్‌రేట్‌తో 33 పరుగులు చేశాడు.