ఇండియా-ఏకు భారీ షాక్‌.. వైభ‌వ్ సూర్య‌వంశీకి గాయం! | Vaibhav Sooryavanshi Injured Before India Debut | Sakshi
Sakshi News home page

ఇండియా-ఏకు భారీ షాక్‌.. వైభ‌వ్ సూర్య‌వంశీకి గాయం!

Jun 14 2026 4:00 PM | Updated on Jun 14 2026 5:04 PM

Vaibhav Sooryavanshi Injured Before India Debut

ట్రై సిరీస్ ఆడేందుకు శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఇండియా-ఏ జ‌ట్టుకు భారీ షాక్ తగిలింది. యువ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్యవంశీకి గాయం అయిన‌ట్లు తెలుస్తోంది. దీంతో సోమ‌వారం శ్రీలంక‌తో జ‌ర‌గ‌నున్న వ‌న్డే మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ ఆడేది అనుమానంగానే ఉంది. ఆదివారం ప్రాక్టీస్ సెష‌న్‌కు వ‌చ్చిన వ‌చ్చిన వైభ‌వ్ సూర్య‌వంశీ గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. 

దీంతో వైభ‌వ్‌ ప్రాక్టీస్ మ‌ధ్య‌లోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే నివేదిక‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ గాయం తీవ్రత ఎంత అనేది స్ప‌ష్టంగా తెలియ‌రాలేదు. ఇక రేపు శ్రీలంక‌-ఏతో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌కు వైభ‌వ్ దూర‌మైతే అత‌డి స్థానంలో నిశాంత్ సింధును జ‌ట్టులోకి తీసుకునే అవ‌కాశ‌ముంది. 

ఎలాగూ టాపార్డ‌ర్‌లో ప్ర‌భ్‌సిమ్ర‌న్‌, ప్రియాన్ష్ ఆర్య‌, రుతురాజ్ ఉండ‌డంతో వీరిలో ఇద్ద‌రు ఓపెన‌ర్లుగా వ‌స్తే, ఒక‌రు వ‌న్‌డౌన్‌లో రావ‌డం ఖాయం. కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ నాలుగో స్థానంలో ఆడుతాడు. ఇక వైభ‌వ్ సూర్య‌వంశీ తొలి మ్యాచ్‌లో విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ, రెండో మ్యాచ్‌లో మాత్రం 22 బంతుల్లో 44 ప‌రుగులతో త‌న‌దైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.

అయితే వైభ‌వ్ సూర్య‌వంశీ గాయం అప్‌డేట్‌పై ఎలాంటి స‌మాచారం లేన‌ప్ప‌టికీ  రాబోయే ఇంగ్లండ్‌, ఐర్లాండ్ టూర్ల‌తో పాటు ఆసియా గేమ్స్ ఆడే టీమిండియా జ‌ట్టులో వైభ‌వ్ చోటు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. వైభవ్‌కు గాయం తీవ్ర‌త ఎక్కువగా లేక‌పోతే రాబోయే ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియాకు ఆడే సువ‌ర్ణావ‌కాశం ల‌భిస్తుంది. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో సంచ‌ల‌న బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టిన వైభ‌వ్ సూర్య‌వంశీని బీసీసీఐ అనూహ్యంగా టీమిండియాలోకి ఎంపిక చేసింది. ఇంగ్లండ్‌, ఐర్లాండ్ టూర్ల‌తో పాటు ఆసియా గేమ్స్‌కు కూడా వైభ‌వ్ సూర్య‌వంశీ టీమిండియాలో చోటు ద‌క్కించుకున్నాడు. 

ఒక‌వేళ ఐర్లాండ్‌తో ప‌ర్య‌ట‌న‌కు ముందే సూర్య‌వంశీ ఫిట్‌నెస్ నిరూపించుకుంటే, స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో భార‌తదేశం త‌ర‌ఫున అరంగేట్రం చేసిన అతిపిన్న వ‌య‌స్కుడిగా నిలిచే అవ‌కాశ‌ముంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement