
టోక్యోలోని (జపాన్) కొరాకుఎన్ హాల్‌లో జరిగిన బాక్సింగ్ ఈవెంట్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఈవెంట్‌లో జరిగిన రెండు వేర్వేరు బౌట్లలో (మ్యాచ్‌లు) ఇద్దరు జపనీస్ బాక్సర్లు మృతి చెందారు. వీరిద్దరికి ఒకే రకమైన గాయాలు (బ్రెయిన్ ఇంజ్యూరీ) కావడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. మృతుల పేర్లు షిగెటోషి కొటారి, హిరోమాసా ఉరకావా. వీరిద్దరి వయసు కూడా 28 కావడం గమనార్హం. రోజు వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు వదిలారు.
ఈ విషాద ఘటన బాక్సింగ్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. యువ బాక్సర్లు, ఒకే వయసు వాళ్లు, ఒకే ఈవెంట్‌లో, రోజు వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం క్రీడా ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది.
జపాన్ బాక్సింగ్ చరిత్రలో ఒకే ఈవెంట్‌లో పాల్గొన్న ఇద్దరు బాక్సర్లకు స్కల్ ఓపెన్ సర్జరీ (పుర్రెని ఓపెన్ చేసి మెదడుకు సర్జరీ) జరగడం ఇదే మొదటిసారి. ఇద్దరు యువ బాక్సర్లు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు బాక్సింగ్ రింగ్ తరహాలోనే వీరోచితంగా పోరాడారు. అయితే చివరికి మరణమే వారిపై విజయం సాధించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. టోక్యోలోని కొరాకుఎన్ హాల్‌లో జరిగిన బాక్సింగ్ ఈవెంట్‌లో సూపర్ ఫెథర్ వెయిట్ విభాగంలో కొటారి, లైట్ హెవి వెయిట్ విభాగంలో హిరోమాసా పోటీ పడ్డారు. ఆగస్ట్ 2న జరిగిన బౌట్‌లో కొటారి జపాన్‌కే చెందిన యమోటా హటాతో 12 రౌండ్ల పాటు పోరాడి బౌట్‌ను డ్రా చేసుకున్నాడు.
అయితే పోటీ ముగిసిన వెంటనే కొటారి స్పృహ కోల్పోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. కొటారి తలకు తీవ్ర గాయాలైనట్లు (మెదడులో రక్తం గడ్డ కట్టింది) డాక్టర్లు గుర్తించారు. వెంటనే బ్రెయిన్ సర్జరీ చేయగా.. కొటారి మృత్యువుతో పోరాడి ఆగస్ట్ 8న తది శ్వాస విడిచాడు.
ఈ విషాద ఘటన నుంచి తేరుకోకముందే ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న హిరోమాసా ఆగస్ట్ 9న ప్రాణాలు కోల్పోయాడు. ఆగస్ట్ 2నే జరిగిన పోటీలో హిరోమాసా యోజీ సైటోతో 8 రౌండ్ల పాటు పోరాడి ఓడాడు. పోటీ సందర్భంగా తలకు తీవ్ర గాయాలు కావడంతో హిరోమాసాను ఆసుపత్రికి తరలించారు.
కొటారి మృతికి గత కారణాలే (మెడదులో రక్తం గడ్డ కట్టడం) హిరోమాసా మరణానికి కూడా కారణమయ్యాయి. కొటారి తుది శ్వాస విడిచిన మరుసటి రోజే హిరోమాసా కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద మరణాలు బాక్సింగ్ ప్రపంచాన్ని కుదిపేశాయి.