
జింబాబ్వేతో ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 7) ప్రారంభం కాబోయే రెండో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు వరుస షాక్‌లు తగిలాయి. తొలుత పేసర్ విలియమ్ ఓరూర్కీ వెన్ను గాయం కారణంగా మ్యాచ్ నుంచి తప్పుకోగా.. తాజాగా రెగ్యులర్ కెప్టెన్ టామ్ లాథమ్ ఫిట్‌నెస్ పరీక్షను క్లియర్ చేయలేక సిరీస్ నుంచి వైదొలిగాడు. ఓరూర్కీకి ప్రత్యామ్నాయంగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బెన్ లిస్టర్‌ను ఎంపిక చేసిన న్యూజిలాండ్ సెలెక్టర్లు.. లాథమ్‌కు రీప్లేస్‌మెంట్‌గా 23 ఏళ్ల ఆక్లాండ్ బ్యాటర్ బెవాన్ జాకబ్స్‌ను సెలెక్ట్ చేశారు.
లిస్టర్ ఇదివరకే జట్టులో చేరిపోగా.. జొహనెస్‌బర్గ్‌లో క్లబ్ క్రికెట్ ఆడుతున్న జాకబ్స్‌ను హుటాహుటిన జట్టులో చేరాలని మేనేజ్‌మెంట్ ఆదేశించింది. లాథమ్ గైర్హాజరీలో మిచెల్ సాంట్నర్ న్యూజిలాండ్ సారధిగా కొనసాగనున్నాడు. లాథమ్ భుజం గాయంతో బాధపడుతుండటంతో సాంట్నర్ తొలి టెస్ట్‌లోనూ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో టెస్ట్ భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా మ్యాట్ హెన్రీ ఉగ్రరూపం దాల్చి జింబాబ్వే బ్యాటర్లను బెంబేలెత్తించాడు. హెన్రీ ధాటికి జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌ల్లో స్వల్ప స్కోర్లకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన హెన్రీ, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.
ఆ మ్యాచ్‌లో ప్రస్తుతం గాయపడిన పేసర్ విలియమ్ ఓరూర్కీ కూడా పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయలేకపోయినా, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (88), డారిల్ మిచెల్ (80) కూడా రాణించారు. కాన్వే చాలాకాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చాడు.