టీమిండియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్ తప్పు మీద తప్పులు చేస్తోంది. తొలిరోజు కేఎల్ రాహుల్ ఔట్ విషయంలో రివ్యూలు తీసుకోవడంలో తడబడ్డ అఫ్గానిస్తాన్ రెండో రోజు ఆటలోనూ అదే తప్పును పునరావృతం చేసింది. ఫలితంగా టీమిండియా భారీ స్కోరు చేయడమే గాక మ్యాచ్‌పై పట్టు సాధించేలా చేసింది.
తొలిరోజు ఆటలో కేఎల్ రాహుల్ 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు అజ్మతుల్లా ఒమర్‌జయ్ వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో రాహుల్ మిస్ అయ్యాడు. దీంతో బంతి అతడి బ్యాట్‌ను ముద్దాడుతూ కీపర్ చేతుల్లో పడింది. కీపర్ అఫ్సర్ జజయ్ ఔట్ అప్పీల్ చేసినప్పటికీ, అంపైర్ ఔటివ్వలేదు. అయితే కెప్టెన్ హస్మతుల్లా షాహిది కీపర్‌ను అడిగినప్పటికీ అతడు క్లారిటీతో లేకపోవడం వల్ల రివ్యూ వెళ్లలేదు.
ఆ తర్వాత రిప్లేలో రాహుల్ బ్యాట్‌కు బంతి తాకినట్లు స్పైక్ రావడం కనిపించింది. దీంతో 16 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ రాహుల్ ఆ తర్వాత శతకం బాదాడు. తొలిరోజు చేసిన తప్పు నుంచి పాఠాలు నేర్వని అఫ్గానిస్తాన్ రెండోరోజు ఆటలోనూ అదే తప్పిదం చేసింది. ఈసారి గిల్ విషయంలో రివ్యూకు తీసుకోవడంలో విఫలమైంది.
ఇన్నింగ్స్ 89వ ఓవర్‌లో ఒమర్‌జయ్ వేసిన బంతి గిల్ ప్యాడ్లను తాకింది. అయితే ఆఫ్గన్ ఆటగాళ్లు అప్పీల్ చేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ ఔటివ్వలేదు. అయితే ఒమర్‌జయ్ రివ్యూ వెళ్లాలని కెప్టెన్ షాహిదిని కోరినప్పటికీ, అతడు బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ అవుతుందేమోనని భావించి రివ్యూ కోరలేదు. కానీ రిప్లేలో బ్యాట్‌కు బంతి ఎక్కడా తగలకుండా లెగ్ స్టంప్‌ను ఎగరేస్తున్నట్లు కనిపించింది. ఒకవేళ రివ్యూకు వెళ్లి ఉంటే గిల్ 109 పరుగుల వద్దే వెనుదిరిగేవాడు.
ఈ రెండు తప్పుల తర్వాత కూడా ఆఫ్గన్ తమ లెక్కను సరిచేసుకోలేకపోయింది. ఆ మరుసటి బంతికే రిషబ్ పంత్ కూడా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఒమర్‌జయ్ వేసిన బంతిని పంత్ షాడ్ ఆడే ప్రయత్నంలో మిస్ చేశాడు. దీంతో బంతి కీపర్ అఫ్సర్ చేతిలో పడింది. అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ ఔటివ్వలేదు.సెకండ్ స్లిప్‌లో ఉన్న రహమనుల్లా గుర్బాజ్ మాత్రం బంతి పంత్ బ్యాట్‌కు తగిలిందని, రివ్యూ వెళ్లాలని కెప్టెన్ షాహిదికి కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.
కానీ షాహిది మాత్రం రివ్యూకు వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ అయినట్లు స్పైక్ రావడంతో కెప్టెన్ ఆశ్చర్యపోయాడు. అలా 54 పరుగుల వద్ద ఔట్ ప్రమాదం నుంచి బయటపడిన పంత్ తన స్కోరుకు మరో 27 పరుగుల జత చేసుకున్నాడు. ఇలా మూడుసార్లు కీలక ఆటగాళ్లను ఔట్ చేసే విషయంలో ఆఫ్గన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ రివ్యూ తీసుకోవడంలో విఫలమై ఆఫ్గన్ కొంపముంచాడు. అతడి తప్పుల వల్ల టీమిండియా 550 పరుగుల మార్క్‌ను అందుకోగలిగింది.
ఒకవేళ సరైన సమయంలో రివ్యూలు తీసుకొని ఉంటే టీమిండియా ఆట నాలుగు వందల్లోపే ముగిసి ఉండేది. మ్యాచ్ విషయానికొస్తే భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ పూర్తవ్వగానే గిల్ డిక్లేర్‌కు పిలుపునిచ్చాడు. కేఎల్ రాహుల్, గిల్ సెంచరీలు చేయగా.. పంత్, సాయి సుదర్శన్, సుందర్‌లు అర్థసెంచరీలతో మెరిశారు. ఆఫ్గన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లతో మెరవగా, జియావుర్ రెహమాన్, హస్మతుల్లా చెరొక వికెట్ తీశారు.


