ట్రోఫీతో యువ క్రికెటర్ సాయినాథ్‌రెడ్డి
భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ఎంపికైన సాయినాథ్ రెడ్డి
శ్రీలంకతో అంతర్జాతీయ సిరీస్‌లో ప్రాతినిధ్యం
ప్రతిభకు వైకల్యం అడ్డంకి కాదని నిరూపిస్తున్నాడు మేడ్చల్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్ వేముల సాయినాథ్ రెడ్డి. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాలనే సంకల్పంతో చిన్నప్పటి నుంచి క్రికెట్‌లో మెలకువలు నేర్చుకుంటూ కఠోర శ్రమ, పట్టుదలతో ముందుకు సాగి అంతర్జాతీయ క్రికెట్‌కు దివ్యాంగుల కోటాలో ఎంపికయ్యాడు. పూడూర్–కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన సాయినాథ్ రెడ్డి భారత్–శ్రీలంక మధ్య జరగనున్న ఫిజికల్ డిజెబిలిటీ అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌కు భారత జట్టులో స్థానం సంపాదించాడు.
చిన్ననాటి నుండే మక్కువతో...
వేముల రవీందర్‌రెడ్డి–లత దంపతుల కుమారుడు సాయినాథ్ రెడ్డికి చిన్ననాటి నుండే క్రీడలపై ఎంతో మక్కువ. అంగవైకల్యం ఉన్నప్పటికీ అడ్డుకాదని నిరూపించుకోవాలనే తపనతో ముందుకు సాగాడు. క్రికెట్, వాలీబాల్ క్రీడలపై ఆసక్తి పెంచుకొని ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ తన లక్ష్యం వైపు అడుగులు వేశాడు. డిగ్రీ చదువుతున్న సమయంలో క్రీడలపై మరింత దృష్టి పెట్టి సోదరుడైన ప్రశాంత్‌రెడ్డి కోచింగ్‌లో గల్లీ క్రికెట్ నుంచి మండల, జిల్లా స్థాయిలో పలు పోటీల్లో పాల్గొన్నాడు.
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది డిజెబిలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు మ్యాచ్‌లలో ప్రతిభను కనబర్చాడు. జాతీయ స్థాయి పోటీల్లోనూ గుర్తింపు తెచ్చుకుని, అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికై ఇండియా–శ్రీలంక ఫిజికల్ డిజబిలిటీ క్రికెట్ సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. అక్టోబర్ 31, నవంబర్ 1,2 తేదీల్లో చెన్నై వేదికగా జరగనున్న టీ 20 సిరీస్‌కు ఇండియా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు.
వాలీబాల్‌లోనూ జాతీయ క్రీడాకారుడిగా గుర్తింపు..
సాయినాథ్‌రెడ్డి క్రికెట్, వాలీబాల్, ఇతర క్రీడల్లోనూ పాల్గొన్నాడు. క్రికెట్‌తో పాటు వాలీబాల్ క్రీడపై పట్టు సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. వాలీబాల్ ఆల్ ఇండియా ప్రబుల్స్‌లో పాల్గొన్న సాయినాథ్ రెడ్డి సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో తెలంగాణ జట్టులో ప్రాతినిధ్యం వహించాడు. సీఎం క్రికెట్ కప్‌లో షాట్‌పుట్,100 మీటర్ల పరుగు పందెంలలో పాల్గొని ఉత్తమ ప్రతిభతో బంగారు పతకం సాధించాడు.
ఇదీ చదవండి: అభిషేక్, వైభవ్‌లకు అన్యాయం చేస్తున్నారు
సెల్‌ఫోన్లకు బానిసై ఫిజికల్ గేమ్స్‌కు దూరమైన నేటితరం యువతకు వేముల సాయినాథ్‌రెడ్డి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. తాను ఈ స్థాయిలో నిలిచేందుకు కృషి చేసిన తల్లిదండ్రులు, సోదరుడు ప్రశాంత్ కోచింగ్, మరికొంత మంది సహకారం ఎప్పటికి మరువలేనని సాయినాథ్‌రెడ్డి పేర్కొన్నారు.


