సరైన సమయంలో రిటైర్మెంట్‌.. గర్వంగా ఉంది! | Telangana Badminton Star B Sumeeth Reddy Announces Retirement, Interesting Facts About Career | Sakshi
Sakshi News home page

B Sumeeth Reddy: సరైన సమయంలో రిటైర్మెంట్‌.. గర్వంగా ఉంది!

Published Tue, Mar 25 2025 10:35 AM | Last Updated on Tue, Mar 25 2025 10:56 AM

Telangana Badminton Star B Sumeeth Reddy Announces Retirement, Interesting Facts About Career

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కూడా పెద్ద పరీక్షలాంటిదే. క్రీడాకారుడిగా కెరీర్‌ బాగా సాగుతున్న దశలోనే ఆట నుంచి వీడ్కోలు తీసుకోవాలంటే తెగువ అవసరం. ఆశించిన విజయాలు లభించకపోయినా... ఆటగాడిగా కొనసాగుతూ... ఇతరుల అవకాశాలను ప్రభావితం చేసే బదులు... వర్ధమాన క్రీడాకారులు తమ కెరీర్‌లో మరింత ఎదిగేందుకు మార్గదర్శిగా మారడం విజ్ఞుల లక్షణం. 

ఆ కోవలోకే తాను వస్తానని తెలంగాణకు చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు బసి సుమీత్‌ రెడ్డి చాటుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) మిక్స్‌డ్‌ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో 25వ ర్యాంక్‌లో ఉన్న సుమీత్‌ రెడ్డి క్రీడాకారుడిగా తన ఇన్నింగ్స్‌ ముగిసిందని సోమవారం ప్రకటించాడు. 

కోచ్‌ రూపంలో ఇప్పటికే రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టానని... భవిష్యత్‌లో భారత్‌కు మెరికల్లాంటి షట్లర్లను తయారు చేయడమే లక్ష్యంగా కోచ్‌గా స్థిరపడతానని సుమీత్‌ స్పష్టం చేశాడు.   

సాక్షి, హైదరాబాద్‌: బ్యాడ్మింటన్‌లో ఉన్న అన్ని ప్రముఖ టోర్నమెంట్‌లలో... నాలుగేళ్లకోసారి జరిగే ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ గేమ్స్, ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకోవడమంటే ఆషామాషీ కాదు. తెలంగాణకు చెందిన 33 ఏళ్ల బుసి సుమీత్‌ రెడ్డి తన కెరీర్‌లో ఇవన్నీ సాకారం చేసుకున్నాడు. 

ఇక తన కెరీర్‌లో మళ్లీ ఉన్నతస్థితికి చేరుకునే అవకాశం లేదని భావించిన సుమీత్‌ ఆటకు వీడ్కోలు పలకడమే ఉత్తమం అని ఆలోచించాడు. తన ఆలోచనను నిజం చేస్తూ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడిగా రిటైర్‌ అవుతున్నట్లు సోమవారం ఇన్‌స్ట్రాగామ్‌ వేదికగా ప్రకటించాడు.

ఇక మీదట తన దృష్టంతా కోచింగ్‌పైనే ఉంటుందని ఈ సందర్భంగా సుమీత్‌ రెడ్డి స్పష్టం చేశాడు. ‘రిటైరయ్యాను. గర్వంగా ఉన్నాను. కెరీర్‌లోని తర్వాతి అధ్యాయం కోసం ఉత్సుకతతో ఉన్నాను. నేనీ స్థాయికి చేరుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన కుటుంబసభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని సుమీత్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. 

‘నా పరిమితికి మించి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించాను. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో ఉన్నప్పటికీ నా కెరీర్‌లో ఉన్నత దశ దాటిపోయానని భావిస్తున్నాను. ఇతరత్రా కారణాలతోనూ నా ప్రొఫెషనల్‌ కెరీర్‌ నుంచి వైదొలుగుతున్నాను. 

ఇక ఆటను ఆపేయాలనే సంకేతాలు మన మదిలో మెదిలినపుడు ఎలాంటి సంకోచం లేకుండా నిర్ణయం తీసుకోవాలి. వెన్నునొప్పి కారణంగా ఒకదశలో వైద్యులు బ్యాడ్మింటన్‌ను వదిలేయాలని సూచించారు. కానీ హెడ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఇచి్చన ప్రోత్సాహంతో, ఆయన ఇచ్చిన సలహాలతో డబుల్స్‌ వైపు అడుగులు వేసి కెరీర్‌ను తీర్చిదిద్దుకున్నాను’ అని సుమీత్‌ వ్యాఖ్యానించాడు.  

నాన్న ప్రోద్భలంతో... 
అథ్లెటిక్స్‌ నేపథ్యమున్న తన తండ్రి భాస్కర్‌ రెడ్డి ప్రోత్సాహంతో 2001లో బ్యాడ్మింటన్‌ రాకెట్‌ పట్టిన సుమీత్‌ 2007లో ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో భారత జూనియర్‌ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు. ఐదేళ్ల తర్వాత 2012లో చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ ద్వారా భారత సీనియర్‌ జట్టు తరఫున తొలిసారి బరిలోకి దిగాడు. అప్పటి నుంచి పుష్కరకాలం పాటు జాతీయ జట్టులో సభ్యుడిగా కొనసాగాడు.

భార్య సిక్కి రెడ్డికి జోడీగా
మనూ అత్రితో కలిసి సుమీత్‌ రెడ్డి 2015లో పురుషుల డబుల్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ 17వ ర్యాంక్‌ను అందుకోగా... భార్య సిక్కి రెడ్డితో కలిసి సుమీత్‌ 2025 మార్చిలో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ 25వ ర్యాంక్‌లో నిలిచాడు. 

2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల్లో, 2018 జకార్తా ఆసియా క్రీడల్లో టీమ్‌ విభాగంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సుమీత్‌ రెడ్డి 2016 రియో ఒలింపిక్స్‌లో మనూ అత్రికి కలిసి పురుషుల డబుల్స్‌ విభాగంలో పోటీపడ్డాడు. ఒక విజయం, రెండు పరాజయాలు నమోదు చేసుకొని సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి ద్వయం రియో ఒలింపిక్స్‌లో గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది.  

12 అంతర్జాతీయ టైటిల్స్‌... 
2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో రజతం నెగ్గిన భారత జట్టులో సుమీత్‌ సభ్యుడిగా ఉన్నాడు. 2016లో హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన టీమిండియాలోనూ సుమీత్‌ సభ్యుడిగా నిలిచాడు. 

2016లో గువాహటిలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో, 2019లో కఠ్మాండూలో జరిగిన దక్షిణాసియా ఆసియా క్రీడల్లో సుమీత్‌ రెడ్డి పురుషుల డబుల్స్, పురుషుల టీమ్‌ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) సర్క్యూట్‌లో సుమీత్‌ రెడ్డి ఓవరాల్‌గా 12 టైటిల్స్‌ సాధించాడు. ఇందులో గ్రాండ్‌ప్రి స్థాయికి చెందిన రెండు పురుషుల డబుల్స్‌ టైటిల్స్‌ (2015లో మనూ అత్రితో కలిసి మెక్సికో సిటీ గ్రాండ్‌ప్రి; 2016లో మనూ అత్రితో కలిసి కెనడా ఓపెన్‌) ఉన్నాయి. అంతర్జాతీయ చాలెంజ్, అంతర్జాతీయ సిరీస్‌ కేటగిరీల్లో కలిపి సుమీత్‌ 10 టైటిల్స్‌ గెలిచాడు.  

2021లో భార్య సిక్కి రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో సిక్కీ సుమీత్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీని ప్రారంభించి ఒకవైపు కెరీర్‌ను కొనసాగిస్తూనే చిన్నారులకు శిక్షణ ఇచ్చాడు. ప్రస్తుతం జాతీయ డబుల్స్‌ కోచ్‌ల ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్న సుమీత్‌ భవిష్యత్‌లో భారత జట్టు బ్యాడ్మింటన్‌ పవర్‌హౌస్‌గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement