commonwealth champion
-
సరైన సమయంలో రిటైర్మెంట్.. గర్వంగా ఉంది!
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కూడా పెద్ద పరీక్షలాంటిదే. క్రీడాకారుడిగా కెరీర్ బాగా సాగుతున్న దశలోనే ఆట నుంచి వీడ్కోలు తీసుకోవాలంటే తెగువ అవసరం. ఆశించిన విజయాలు లభించకపోయినా... ఆటగాడిగా కొనసాగుతూ... ఇతరుల అవకాశాలను ప్రభావితం చేసే బదులు... వర్ధమాన క్రీడాకారులు తమ కెరీర్లో మరింత ఎదిగేందుకు మార్గదర్శిగా మారడం విజ్ఞుల లక్షణం. ఆ కోవలోకే తాను వస్తానని తెలంగాణకు చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు బసి సుమీత్ రెడ్డి చాటుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మిక్స్డ్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 25వ ర్యాంక్‌లో ఉన్న సుమీత్ రెడ్డి క్రీడాకారుడిగా తన ఇన్నింగ్స్ ముగిసిందని సోమవారం ప్రకటించాడు. కోచ్ రూపంలో ఇప్పటికే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టానని... భవిష్యత్‌లో భారత్‌కు మెరికల్లాంటి షట్లర్లను తయారు చేయడమే లక్ష్యంగా కోచ్‌గా స్థిరపడతానని సుమీత్ స్పష్టం చేశాడు. సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్‌లో ఉన్న అన్ని ప్రముఖ టోర్నమెంట్లలో... నాలుగేళ్లకోసారి జరిగే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ క్రీడల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకోవడమంటే ఆషామాషీ కాదు. తెలంగాణకు చెందిన 33 ఏళ్ల బుసి సుమీత్ రెడ్డి తన కెరీర్లో ఇవన్నీ సాకారం చేసుకున్నాడు. ఇక తన కెరీర్లో మళ్లీ ఉన్నతస్థితికి చేరుకునే అవకాశం లేదని భావించిన సుమీత్ ఆటకు వీడ్కోలు పలకడమే ఉత్తమం అని ఆలోచించాడు. తన ఆలోచనను నిజం చేస్తూ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా రిటైర్ అవుతున్నట్లు సోమవారం ఇన్‌స్ట్రాగామ్ వేదికగా ప్రకటించాడు.ఇక మీదట తన దృష్టంతా కోచింగ్‌పైనే ఉంటుందని ఈ సందర్భంగా సుమీత్ రెడ్డి స్పష్టం చేశాడు. ‘రిటైరయ్యాను. గర్వంగా ఉన్నాను. కెరీర్‌లోని తర్వాతి అధ్యాయం కోసం ఉత్సుకతతో ఉన్నాను. నేనీ స్థాయికి చేరుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన కుటుంబసభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని సుమీత్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ‘నా పరిమితికి మించి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించాను. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో ఉన్నప్పటికీ నా కెరీర్లో ఉన్నత దశ దాటిపోయానని భావిస్తున్నాను. ఇతరత్రా కారణాలతోనూ నా ప్రొఫెషనల్ కెరీర్ నుంచి వైదొలుగుతున్నాను. ఇక ఆటను ఆపేయాలనే సంకేతాలు మన మదిలో మెదిలినపుడు ఎలాంటి సంకోచం లేకుండా నిర్ణయం తీసుకోవాలి. వెన్నునొప్పి కారణంగా ఒకదశలో వైద్యులు బ్యాడ్మింటన్‌ను వదిలేయాలని సూచించారు. కానీ హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఇచి్చన ప్రోత్సాహంతో, ఆయన ఇచ్చిన సలహాలతో డబుల్స్ వైపు అడుగులు వేసి కెరీర్‌ను తీర్చిదిద్దుకున్నాను’ అని సుమీత్ వ్యాఖ్యానించాడు. నాన్న ప్రోద్భలంతో... అథ్లెటిక్స్ నేపథ్యమున్న తన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రోత్సాహంతో 2001లో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన సుమీత్ 2007లో ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత జూనియర్ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు. ఐదేళ్ల తర్వాత 2012లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ ద్వారా భారత సీనియర్ జట్టు తరఫున తొలిసారి బరిలోకి దిగాడు. అప్పటి నుంచి పుష్కరకాలం పాటు జాతీయ జట్టులో సభ్యుడిగా కొనసాగాడు.భార్య సిక్కి రెడ్డికి జోడీగామనూ అత్రితో కలిసి సుమీత్ రెడ్డి 2015లో పురుషుల డబుల్స్‌లో కెరీర్ బెస్ట్ 17వ ర్యాంక్‌ను అందుకోగా... భార్య సిక్కి రెడ్డితో కలిసి సుమీత్ 2025 మార్చిలో మిక్స్డ్ డబుల్స్‌లో కెరీర్ బెస్ట్ 25వ ర్యాంక్‌లో నిలిచాడు. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో, 2018 జకార్తా ఆసియా క్రీడల్లో టీమ్ విభాగంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సుమీత్ రెడ్డి 2016 రియో ఒలింపిక్స్‌లో మనూ అత్రికి కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో పోటీపడ్డాడు. ఒక విజయం, రెండు పరాజయాలు నమోదు చేసుకొని సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం రియో ఒలింపిక్స్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 12 అంతర్జాతీయ టైటిల్స్... 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజతం నెగ్గిన భారత జట్టులో సుమీత్ సభ్యుడిగా ఉన్నాడు. 2016లో హైదరాబాద్ వేదికగా జరిగిన ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన టీమిండియాలోనూ సుమీత్ సభ్యుడిగా నిలిచాడు. 2016లో గువాహటిలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో, 2019లో కఠ్మాండూలో జరిగిన దక్షిణాసియా ఆసియా క్రీడల్లో సుమీత్ రెడ్డి పురుషుల డబుల్స్, పురుషుల టీమ్ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు.ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సర్క్యూట్లో సుమీత్ రెడ్డి ఓవరాల్‌గా 12 టైటిల్స్ సాధించాడు. ఇందులో గ్రాండ్‌ప్రి స్థాయికి చెందిన రెండు పురుషుల డబుల్స్ టైటిల్స్ (2015లో మనూ అత్రితో కలిసి మెక్సికో సిటీ గ్రాండ్‌ప్రి; 2016లో మనూ అత్రితో కలిసి కెనడా ఓపెన్) ఉన్నాయి. అంతర్జాతీయ చాలెంజ్, అంతర్జాతీయ సిరీస్ కేటగిరీల్లో కలిపి సుమీత్ 10 టైటిల్స్ గెలిచాడు. 2021లో భార్య సిక్కి రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో సిక్కీ సుమీత్ బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించి ఒకవైపు కెరీర్‌ను కొనసాగిస్తూనే చిన్నారులకు శిక్షణ ఇచ్చాడు. ప్రస్తుతం జాతీయ డబుల్స్ కోచ్‌ల ప్యానెల్లో సభ్యుడిగా ఉన్న సుమీత్ భవిష్యత్‌లో భారత జట్టు బ్యాడ్మింటన్ పవర్‌హౌస్‌గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. -
భారత వెయిట్‌లిఫ్టర్ సంజితకు భారీ షాక్.. నాలుగేళ్ల నిషేధం
CWG Champion Sanjita Chanu: భారత వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ సంజితా చానుకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(ఎన్ఏడీఏ) గట్టి షాకిచ్చింది. డోపింగ్ టెస్టులో విఫలమైన ఆమెపై నాలుగేళ్లు పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని భారత వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్(ఐడబ్ల్యూఎఫ్) అధ్యక్షుడు సహదేవ్ యాదవ్ ధ్రువీకరించినట్లు వార్తా సంస్థ పీటీఐ మంగళవారం వెల్లడించింది. కాగా నాడా నిర్ణయంతో సంజితాకు భారీ షాక్ తగలనుంది. జాతీయ క్రీడల్లో వెండి పతకం గెలిచిన ఆమె నుంచి మెడల్ వెనక్కి తీసుకోనున్నారు. ఇక గతేడాది నిర్వహించిన డోపింగ్ టెస్టులో సంజిత పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌లో నిషేధిత అనబాలిక్ స్టెరాయిడ్ డ్రొస్టానొలోన్ మెటాబొలైట్ ఆనవాలు లభించింది. నేషనల్ గేమ్స్ సందర్భంగా ఈ టెస్టు నిర్వహించారు. అయితే, ఆ సమయంలో 49 కేజీల విభాగంలో పోటీపడ్డ సంజిత రజతం గెలిచింది. ఇప్పుడు ఆమెను దోషిగా తేలుస్తూ నాడా నిషేధం విధించడంతో ఆమె పతకాన్ని కోల్పోనుంది. అంతేగాక నాలుగేళ్ల పాటు నిషేధం ఎదుర్కొననుంది. కాగా గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2014లో 48 కేజీల విభాగంలో సంజిత స్వర్ణం గెలిచింది. 2018లో గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. కాగా తనపై నిషేధం నేపథ్యంలో సంజితా చాను ఇంతవరకు స్పందించలేదు. చదవండి: సన్‌రైజర్స్‌కు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! ఇక తిరుగుండదు -
రెజ్లర్ సుమిత్‌పై నిషేధం
న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడిన కామన్వెల్త్గేమ్స్ చాంపియన్, భారత రెజ్లర్ సుమిత్ మాలిక్‌పై నిషేధం విధించారు. దీంతో 28 ఏళ్ల హరియాణా రెజ్లర్ ఒలింపిక్స్ ఆశలకు దాదాపు తెరపడినట్లే. అతను అప్పీల్ చేసుకునేందుకు ఒక వారం గడువిచ్చినప్పటికీ ఒలింపిక్స్ సమయానికల్లా ఈ విచారణ ముగిసే అవకాశాల్లేవు. గత నెల సోఫియాలో నిర్వహించిన ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో 125 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీలో పోటీపడిన భారత రెజ్లర్ మెగా ఈవెంట్‌కు అర్హత సంపాదించాడు. కానీ ఆ పోటీ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అతను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా ‘బి’ శాంపిల్‌ను కూడా పరీక్షించగా ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రపంచ రెజ్లింగ్ యూనియన్ (యూడబ్ల్యూడబ్ల్యూ) శుక్రవారం అతనిపై రెండేళ్ల నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో చాంపియన్‌గా నిలిచిన సుమిత్ మాలిక్ అదే ఏడాది భారత ప్రభుత్వం నుంచి క్రీడాపురస్కారం ‘అర్జున’ అవార్డు అందుకున్నాడు. 2017లో న్యూఢిల్లీ ఆతిథ్యమిచ్చిన ఆసియా చాంపియన్‌షిప్, జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన కామన్వెల్త్ చాంపి యన్‌షిప్‌లలో అతను రన్నరప్‌గా నిలిచి రజత పతకాలు సాధించాడు. -
అవకాశాలు వస్తే సినిమాల్లో నటిస్తా!
పెరంబూరు: అవకాశాలు వస్తే సినిమాల్లో నటించడానికి సిద్ధం అని కామన్వెల్త్ చాంపియన్ సతీష్‌కుమార్ శివలింగం పేర్కొన్నారు. ఈయన ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకుని ఆ క్రీడలో పథకం గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కారు. ఒక వాణిజ్య సంస్థకు బ్రాండ్ అంబాసీడర్‌గా నియమితులైన సతీష్‌కుమార్ శివలింగం బుధవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వాణాజ్య ప్రకటనలు, సినిమాల్లో నటించే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు సతీష్‌కుమార్ శివలింగం బదులిస్తూ అలాంటి అవకాశాలు వస్తే, సమయం కుదిరితే తప్పకుండా నటిస్తానని చెప్పారు. అయితే తాను ఎక్కువ సమాయాన్ని క్రీడా శిక్షణలోనే గడుపుతానని తెలిపారు. ప్రతిభ కలిగిన యువకులు గ్రామాల్లో చాలా మంది ఉన్నారని, వారంతా క్రీడల్లో రాణించడానికి మీరిచ్చే సలహా ఏమిటన్న ప్రశ్నకు యువత నిరంతర శిక్షణ పొందాలన్నారు. క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, క్రీడా ప్రేక్షకులు కూడా క్రికెట్ క్రీడలానే ఇతర క్రీడలను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. -
మరో రెండు స్వర్ణాలు...
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): పతకాల వేటలో ఒకరితో మరొకరు పోటీపడుతూ కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగోరోజు భారత షూటర్లు రెండు స్వర్ణాలతో కలిపి మొత్తం ఐదు పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ప్రకాశ్ నంజప్ప స్వర్ణం నెగ్గగా... అమన్‌ప్రీత్ సింగ్ రజతం, జీతూ రాయ్ కాంస్యం సాధించారు. పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో ప్రపంచ నంబర్‌వన్ అంకుర్ మిట్టల్ పసిడి పతకం కైవసం చేసుకోగా... మహిళల డబుల్ ట్రాప్‌లో శ్రేయసి సింగ్ రజతం గెలిచింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్ 15 పతకాలు సాధించం విశేషం. పిస్టల్ ఈవెంట్ క్వాలిఫయింగ్‌లో జీతూ రాయ్ 559 పాయింట్లు, అమన్‌ప్రీత్ 543 పాయింట్లు, ప్రకాశ్ నంజప్ప 542 పాయింట్లు సాధించారు. ఫైనల్లో ప్రకాశ్ 222.4 పాయింట్లతో అగ్రస్థానాన్ని పొందగా... అమన్‌ప్రీత్ 222 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 201.9 పాయింట్లో జీతూ మూడో స్థానంతో సంతృప్తి పడ్డాడు. డబుల్ ట్రాప్ ఫైనల్లో అంకుర్ మిట్టల్ 74 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. మాథ్యూ ఫ్రెంచ్ (బ్రిటన్–72 పాయింట్లు) రజతం, నాథన్ లీ (మాల్టా–54 పాయింట్లు) కాంస్యం గెలిచారు. మహిళల డబుల్ ట్రాప్ ఫైనల్లో శ్రేయసి సింగ్ 96 పాయింట్లు సాధించి రెండో స్థానాన్ని సంపాదించింది. ఎమ్మా కాక్స్ (ఆస్ట్రేలియా–103 పాయింట్లు) పసిడి పతకం... రాచెల్ పారిష్ (ఇంగ్లండ్–93 పాయింట్లు) కాంస్యం నెగ్గారు. -
హీనా మళ్లీ మెరిసింది
బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజే భారత షూటర్ హీనా సిద్ధూ మెరిసింది. మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నీ మహిళల 10మీ. ఎయిర్‌రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో హీనా 240.8 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలీనా గాలియాబొవిచ్ (238.2), క్రిస్టీ గిల్‌మెన్ (213.7) వరుసగా రజత కాంస్యాలను గెలుచుకున్నారు. ఇటీవలే ఢిల్లీలో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్స్ షూటింగ్ టోర్నీలోనూ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో పసిడి పతకాన్ని సాధించిన హీనా, వారం తిరిగే లోపే మరో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్‌కు చెందిన దీపక్ కుమార్ 224.2 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకోగా, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్‌నారంగ్ 203 పాయింట్లు స్కోర్ చేసి నాలుగోస్థానంతో సంతృప్తి చెందాడు. మహిళల స్కీట్ ఈవెంట్లో రష్మీ రాథోడ్ (భారత్) ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆమె క్వాలిఫయింగ్ ఈవెంట్లో 75 పాయింట్లకు గానూ 65 స్కోర్ చేసి ఫైనల్లో ఆఖరిదైన ఆరో స్థానాన్ని దక్కించుకుంది. -
కామన్వెల్త్ చాంపియన్ శిరీషకు ఘన సన్మానం
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కామన్వెల్త్ చాంపియన్ శిరీషను ఆదర్శంగా తీసుకుని పతకాల పంట పండించాలని వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులకు జెడ్పీ సీఈఓ మాల్యాద్రి సూచించారు. కడపలోని వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్లో స్పెషలాఫీసర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో మూడు స్వర్ణపతకాలు సాధించిన జిల్లా క్రీడాకారిణి శిరీషను శుక్రవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీఈఓ మాట్లాడుతూ క్రీడాకారులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు నిరంతర సాధన చేయాలన్నారు. స్పోర్ట్స్ స్కూల్లో జెడ్పీ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. వల్లూరు మండల అభివృద్ధి నిధుల నుంచి ఆమెకు రూ.10 వేలు నగదు ప్రోత్సాహం అందజేస్తామని ప్రకటించారు. జిల్లా క్రీడాకారిణి అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమని స్పోర్ట్స్ స్కూల్ స్పెషలాఫీసర్ కొనియాడారు. పట్టుదలతో మంచి ఫలితాలు సాధించిన శిరీష ఒలంపిక్స్‌లో పతకం సాధించాలని ఆకాంక్షించారు. శిరీషకు జిల్లా అధికారుల తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందేలా చూస్తామని సభలో ప్రకటించారు. గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం అంటే మామూలు విషయం కాదని వల్లూరు ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్ అన్నారు. వల్లూరు మండలం పెద్దపుత్తలో జన్మించిన శిరీష వల్లూరు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు గాను ఆమెకు ‘వల్లూరు క్రీడారత్నం’ బిరుదును ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. అమ్మాయిలకు క్రీడలు ఎందుకు అని చాలామంది నిరుత్సాహ పరచినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను క్రీడల్లో రాణిస్తున్నట్లు శిరీష తెలిపారు. కోచ్‌లు, అధ్యాపకుల సహకారంతో మరిన్ని పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అనంతరం ఆమెను సన్మానించడంతో పాటు నగదు బహుమతిని అందించారు. శిరీష తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, వెంకటశివారెడ్డి, స్పోర్ట్స్ స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ వై.భాస్కర్‌రెడ్డి, కోచ్‌లు నౌషాద్, రంగనాథరెడ్డి, అనిల్, విద్యార్థులు పాల్గొన్నారు.