రెజ్లర్‌ సుమిత్‌పై నిషేధం

Indian Wrestler Sumit Malik Gets Two-year Ban For Doping - Sakshi

టోక్యో ఆశలు ఆవిరైనట్లే!

న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడిన కామన్వెల్త్‌గేమ్స్‌ చాంపియన్, భారత రెజ్లర్‌ సుమిత్‌ మాలిక్‌పై నిషేధం విధించారు. దీంతో 28 ఏళ్ల హరియాణా రెజ్లర్‌ ఒలింపిక్స్‌ ఆశలకు దాదాపు తెరపడినట్లే. అతను అప్పీల్‌ చేసుకునేందుకు ఒక వారం గడువిచ్చినప్పటికీ ఒలింపిక్స్‌ సమయానికల్లా ఈ విచారణ ముగిసే అవకాశాల్లేవు. గత నెల సోఫియాలో నిర్వహించిన ప్రపంచ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో 125 కేజీల ఫ్రీస్టయిల్‌ కేటగిరీలో పోటీపడిన భారత రెజ్లర్‌ మెగా ఈవెంట్‌కు అర్హత సంపాదించాడు.

కానీ ఆ పోటీ సందర్భంగా నిర్వహించిన డోపింగ్‌ పరీక్షల్లో అతను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్‌ వేటు వేశారు. తాజాగా ‘బి’ శాంపిల్‌ను కూడా పరీక్షించగా ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రపంచ రెజ్లింగ్‌ యూనియన్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) శుక్రవారం అతనిపై రెండేళ్ల నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో చాంపియన్‌గా నిలిచిన సుమిత్‌ మాలిక్‌ అదే ఏడాది భారత ప్రభుత్వం నుంచి క్రీడాపురస్కారం ‘అర్జున’ అవార్డు అందుకున్నాడు. 2017లో న్యూఢిల్లీ ఆతిథ్యమిచ్చిన ఆసియా చాంపియన్‌షిప్, జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన కామన్వెల్త్‌ చాంపి యన్‌షిప్‌లలో అతను రన్నరప్‌గా నిలిచి రజత పతకాలు సాధించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top