
ఖాట్మండు: దేశంలో అధికారికంగా నమోదు చేసుకోని సోషల్ మీడియా ఖాతాలను తొలగించాలని ఆమధ్య నేపాల్ ప్రభుత్వం అక్కడి టెలికమ్యూనికేషన్స్ అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో మెటాకు చెందిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఎలోన్ మస్క్ కు చెందిన ‘ఎక్స్’తోపాటు 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నేపాల్‌లో నిషేధించారు. అయితే దీనిని నిరసిస్తూ జరిగిన ఆందోళనల్లో 19 మరణించగా, 300 మందికిపైగా జనం గాయపడ్డారు. దీంతో నేపాల్ ప్రభుత్వం రాత్రికి రాత్రి సోషల్ మీడియా సైట్‌లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే 26 సోషల్ మీడియా ప్లాట్ ఫారాలపై నిషేధం విధించిన నేపాల్ ‘టిక్‌టాక్’కు ఎందుకు మినహాయింపునిచ్చింది? ఈ ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతోంది.
దేశంలోని ప్రజలు వినియోగించే పలు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లకు నేపాల్ ప్రభుత్వం అధికారిక నమోదుకు ఏనాడో ఆదేశాలు జారీ చేసిందని నేపాల్ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ ఆదేశాలను సోషల్ మీడియా సంస్థలు పట్టించుకోలేదు. దీంతో వాటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే బైట్‌డాన్స్ యాజమాన్యంలోని చైనీస్ అప్లికేషన్ ‘టిక్‌టాక్’ నేపాల్‌లో అందుబాటులో ఉన్న ఏకైక అధికారిక యాప్‌గా నిలిచింది. బైట్‌డాన్స్ కంపెనీ నేపాల్ ఆదేశాలకు అనుగుణంగా సకాలంలో కొత్త నిబంధనల ప్రకారం నమోదు ప్రక్రియను పూర్తిచేసుకుంది.
2023 ప్రారంభంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసినందుకు నేపాల్ ‘టిక్‌టాక్’ను నిషేధించింది. టిక్‌టాక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ తన జవాబుదారీతనాన్ని నిలబెట్టుకునేందుకు నేపాల్‌లో ఒక అనుసంధాన కార్యాలయాన్ని తెరవాలని, పన్నులు చెల్లించాలని, దేశ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని అప్పటి విదేశాంగ మంత్రి నారాయణ్ ప్రకాష్ సౌద్ కోరారు. అయితే ఇది జరిగిన తొమ్మిది నెలల తర్వాత 2024, ఆగస్టులో ప్రధాని ఖడ్గా ప్రసాద్ ఓలి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది. ఇదే సమయంలో టిక్‌టాక్ కంపెనీ కార్యనిర్వాహకులు నేపాల్ చట్టాలను పాటిస్తామని హామీ ఇచ్చారు. ఈ కారణంగానే 26 సోషల్ మీడియా యాప్‌లపై నిషేధం విధించిన నేపాల్ ‘టిక్‌టాక్’కు మినహాయింపునిచ్చింది.